Tomato Price | న్యూఢిల్లీ, జూలై 10: కూరగాయల ధరలు వింటే చాలు సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఒక్క టమాటా ధరే కాదు..కాలిఫ్లవర్, క్యాబేజీ, బీన్స్, చిక్కుడు, బెండ, వంకాయ, దొండకాయలు..అన్నింటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. మోదీ సర్కార్ ముందు చూపు లేకపోవటం, వివిధ రాష్ర్టాల్లో భారీ వర్షాలు.. ఈ పరిస్థితికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వర్షాల తాకిడికి రహదారులు దెబ్బతినగా, కూరగాయల రవాణా స్తంభించిపోయింది. దీంతో రాబోయే రోజుల్లో టమాటా సహా అన్ని కూరగాయల ధరలు మరింత పెరగవచ్చునని తెలుస్తున్నది. వర్షాలు, వరదల వల్ల ఆయా రాష్ర్టాల్లో కూరగాయల సాగు దెబ్బతిన్నదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా రూ.150కి చేరుకుంది. బెంగళూరు నుంచి ఇతర రాష్ర్టాలకు టమాటా సరఫరా ఇప్పటికే గణనీయంగా పడిపోయింది. ఇదిలా ఉండగా, టమాటా ధరలు పెరిగాయని విమర్శించినందుకు ఉత్తరప్రదేశ్లో యోగి సర్కార్ ఇద్దరు వ్యక్తులపై పోలీసు కేసులు నమోదుచేసింది. దుకాణం యజమాని, అతడి కుమారుడ్ని పోలీసులు అరెస్టు చేయటాన్ని సమాజ్వాదీ పార్టీ తప్పుబట్టింది.
పప్పులు కొనటం పెరిగింది
‘ఈ సీజన్లో హిమాచల్ నుంచి క్యాబేజీ, కాలిఫ్లవర్, క్యాప్సికం పెద్ద మొత్తంలో ఇతర రాష్ర్టాలకు రవాణా అవుతుంది. ఈసారి అక్కడ సాగుచేస్తున్న పంటలన్నీ భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి. కర్ణాటకలో టమాటాకు కీటకాల బెడద ఎక్కువైంది. దీంతో దిగుబడి పడిపోయి, కూరగాయల ధరలు మరింత పెరగవచ్చు’ అని బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్కే సింగ్ చెప్పారు. కూరగాయలకు బదులు పప్పులు కొనటం పెరుగుతున్నదని, వీటి ధరలు పెరగటం కూడా మొదలైందని ఆయన గుర్తుచేశారు. టమాటా మార్కెట్కు రావటం తగ్గటంతో ఒక్కవారంలోనే ధర రూ.150కి పెరిగిందని ఢిల్లీలోని ఆజాద్పూర్ టమాటా ట్రేడర్ అమిత్ మాలిక్ అన్నారు.
2 వేల కిలోల టమాటా దోపిడీ..
బెంగళూరులో టమాటా తరలిస్తున్న ఓ రైతు వాహనంపై కొంతమంది దారికాచి దోపిడీకి పాల్పడ్డారు. రెండు వేల కిలోల టమాటాను వాహనంలో కోలార్ మార్కెట్కు తరలిస్తుండగా ఈ దారి దోపిడీ జరిగిందని, రైతుపై దాడిచేసి వాహనాన్ని లాక్కెళ్లారని పోలీసులు తెలిపారు. ఆర్ఎంసీ యార్డ్ పోలీస్స్టేషన్ పరిధిలో గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.