న్యూఢిల్లీ: దేశంలో గత ఆరు నెలలుగా ప్రమాదాల సంఖ్య పెరుగడంతో స్లీపర్ బస్సుల భద్రతా నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది. ఇటీవలి కాలంలో స్లీపర్ బస్సుల్లో చోటుచేసుకున్న ప్రమాదాల కారణంగా 145 మంది అసువులు బాశారు. కొత్త నిబంధనల ప్రకారం ఇక నుంచి ఆటోమొబైల్ కంపెనీలు, లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన తయారీదారులను మాత్రమే స్లీపర్ బస్సుల నిర్మాణానికి అనుమతిస్తారని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ తెలిపారు.
ఈ కొత్త నిబంధనలే కాక, ప్రస్తుతమున్న అన్ని స్లీపర్ బస్సుల్లో భద్రతా నిబంధనలకు అనుగుణంగా అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలి. అంటే మంటలను గుర్తించే వ్యవస్థ, సుత్తులతో కూడిన అత్యవసర ద్వారాలు, అత్యవసర లైటింగ్, డ్రైవర్ నిద్రమత్తును గుర్తించి అప్రమత్తం చేసే ఇండికేటర్లు అమర్చుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
ఇటీవల ప్రమాదానికి గురైన స్లీపర్ బస్సుల్లో పలు భద్రతాపరమైన లోపాలను దర్యాప్తు బృందాలు గుర్తించాయన్నారు. ముఖ్యంగా మండే స్వభావం గల సీట్లు, ఇతర పదార్థాలు, సీల్ చేసిన ద్వారాలు ఉండటం, అత్యవసర కిటికీలు లేకపోవడం, అగ్నిమాపక నిరోధకాలు వంటి కనీస భద్రతా పరికరాలు కూడా ఉంచకపోవడాన్ని దర్యాప్తు బృందాలు గుర్తించాయని ఆయన తెలిపారు. ఇటీవల తెచ్చిన కొత్త పథకం ప్రకారం రోడ్డు ప్రమాద బాధితులు గుర్తింపు పొందిన దవాఖానల్లో నగదు రహిత చికిత్స చేయించుకోవచ్చునని చెప్పారు. గోల్డెన్ అవర్స్‌లో బాధితులకు చికిత్స నిరాకరించ వద్దని దవాఖానలకు గట్టి ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి గడ్కరీ తెలిపారు.