హైదరాబాద్, నవంబర్ 7 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): రోజు గడవడం కోసం కష్టపడే శ్రమ జీవులను కాంగ్రెస్ నేతలు నిండా ముంచారు. కుటుంబ పోషణ కోసం ఎదురు చూస్తున్న అడ్డా కూలీలను వాడుకుని నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ మంత్రి, కాంగ్రెస్ నేత శాంతి ధారివాల్ నామినేషన్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది.
రాజేశ్ సమారియా అనే కూలీ తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల శాంతి ధారివాల్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేయడం కోసం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు కొందరు అడ్డా కూలీలను బస్సులో తీసుకెళ్లారు. రోజుకు రూ.500 చొప్పున ఇస్తామని వారికి హామీ ఇచ్చారు.
నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ అడ్డా కూలీలను బస్టాండ్ వద్ద వేచి ఉండమని ధారివాల్ అనుచరులు చెప్పారు. 39 మంది కూలీలు డబ్బుల కోసం సాయంత్రం వరకు ఎదురు చూశారు. తమకు డబ్బులిచ్చేందుకు కాంగ్రెస్ నాయకులెవరూ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత కాస్త ధైర్యం తెచ్చుకుని మంగళవారం దాదాబాడి జిల్లా, కోటా పోలీసులను ఆశ్రయించారు. తమకు రోజుకు రూ.500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ చెప్పారని, సాయంత్రం వరకు ఎదురు చూసిన తర్వాత ఆయనకు ఫోన్ చేస్తే, తమకే డబ్బులు రాలేదని ఆయన సమాధానం చెప్పారని తెలిపారు. తమకు డబ్బులిప్పించాలని ఫిర్యాదులో కోరారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కూలి పనికి వెళ్లకపోవడంతో తమకు జీవనాధారం పోయిందని కూలీలు వాపోయారు.