గత రెండు వారాలుగా దేశంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా పార్టీల్లో చీలికలు, తిరుగుబాట్లకు, కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధం ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు. అధికార ఎన్డీఏకు 54 ఓట్లు తక్కువ కావడంతో రాజ్యాంగ సవరణ బిల్లును ఏప్రిల్లో మోదీ సర్కార్ ఆమోదించుకోలేక పోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకునే లక్ష్యంతోనే దేశంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు.
ఇటీవల టీఎంసీ, శివసేన (యూబీటీ)లో తిరుగుబాట్లను చూస్తే ఎన్డీఏ కూటమి బలం పెంచుకునే చర్యలే అని అర్థమవుతున్నది. ప్రస్తుతం టీఎంసీ ఎంపీలు 20, శివసేన (యూబీటీ) ఎంపీలు ఆరుగురు కలిస్తే ఎన్డీఏ బలం అదనంగా 26 సీట్లు పెరుగుతుంది. ప్రస్తుతం ఇండియా కూటమితో విభేదించిన తమిళనాడులోని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకి 22 మంది ఎంపీలు ఉన్నారు. వారితో కేంద్రం ఇప్పటికే చర్చలు జరుపుతున్నది. వారు ఎన్డీఏకు మద్దతు ఇస్తే రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించుకోవడానికి ఇంకా ఆరుగురు ఎంపీలు మాత్రమే అవసరమవుతారు.