Income Tax | న్యూఢిల్లీ, జూలై 23: ఆదాయ పన్ను (ఐటీ) విధానంలో మధ్యతరగతి, వేతన జీవుల ఆకాంక్షల్ని మోదీ సర్కారు పట్టించుకోలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను మంగళవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లపై ఊరించి ఉసూరుమనిపించారు. అంకెల గారడీతో కొత్త పన్ను విధానంలో ఊరట కల్పించామని భ్రమింపజేశారు. ట్యాక్స్ పేయర్లందర్నీ కొత్త పన్ను విధానంలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి తగ్గట్టుగానే పాత పన్ను విధానం జోలికి కేంద్ర ప్రభుత్వం వెళ్లలేదు. ఇక కొత్త పన్ను విధానంలో ఇదివరకే ఉన్న పన్ను శ్లాబులను అలాగే ఉంచుతూ.. వాటి కిందనున్న వార్షిక ఆదాయ పరిమితుల్ని మాత్రం కొద్దిగా సవరించారు.
గతంతో పోల్చితే 5 శాతం పన్ను పరిధిలో ఉన్న రూ.3-6 లక్షల శ్లాబును రూ.3-7 లక్షలకు పెంచారు. అలాగే 10 శాతం పన్ను వర్తించే రూ.6-9 లక్షల శ్లాబును రూ.7-10 లక్షలుగా మార్చారు. ఇక 15 శాతం పన్ను విధించే రూ.9-12 లక్షల శ్లాబును రూ.10-12 లక్షలకు తగ్గించారు. 20 శాతం, 30 శాతం పన్నులు పడే రూ.12-15 లక్షలు, రూ.15 లక్షలపైన శ్లాబులను యథాతథంగానే ఉంచారు. అప్పుడు, ఇప్పుడు రూ.3 లక్షలదాకా పన్నులేమీ లేవు. దీంతో రూ.6-7 లక్షల మధ్య, రూ.9-10 లక్షల మధ్య వార్షిక ఆదాయం ఉన్నవారికే పన్నులు తగ్గుతున్నాయి. బడ్జెట్ ప్రసంగంలో ఐటీ సవరణలతో దాదాపు 4 కోట్ల ఉద్యోగులు, పెన్షనర్లకు లాభం చేకూరుతుందని ఆర్థిక మంత్రి చెప్పినా.. రకరకాల వార్షిక ఆదాయాలున్నవారికి ఒరిగేదేమీ లేదు.
కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్‌ను ప్రస్తుతమున్న రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే కొత్త పన్ను విధానంలో మార్పుల వల్ల దాన్ని ఎంచుకున్న వేతన జీవులకు ఏటా రూ.17,500 వరకు పన్ను ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు.
పెన్షనర్ల కోసం కుటుంబ పెన్షన్‌పైనా డిడక్షన్‌ను రూ.25,000కు పెంచారు. ఇంతకుముందు ఇది రూ.15,000గానే ఉన్నది. కాగా, కొత్త మార్పులు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం లేదా 2025-26 మదింపు సంవత్సరానికి వర్తిస్తాయి. ఇదిలావుంటే చారిటబుల్ ట్రస్టుల కోసం రెండు పన్ను మినహాయింపు విధానాలను ఏకం చేస్తున్నామని.. క్రెడిట్, ఈ-కామర్స్, విద్య, ఆరోగ ్య, న్యాయ, ఎంఎస్ఎంఈ సేవల డెలివరీ, పట్టణ పరిపాలనల కోసం డీపీఐ యాప్‌లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

