న్యూఢిల్లీ, మార్చి 7: విద్యుత్తు ప్రైవేటీకరణకు గేట్లు తెరిచే, ప్రభుత్వ రంగంలోని విద్యుత్తు సంస్థలను పణంగా పెట్టే వివాదాస్పద విద్యుత్తు సవరణ బిల్లును ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి కేంద్రంలోని మోదీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఎనర్జీ స్టాండింగ్ కమిటీకి అనుమతి లభించింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ మేరకు వ్యవధిని పొడిగిస్తూ ఎనర్జీ స్టాండింగ్ కమిటీకి అనుమతి మంజూరు చేశారు.
‘ఎలక్ట్రిసిటీ అమెండెంట్ బిల్-2022 పై అభిప్రాయాలు చెప్పాలని స్టాండింగ్ కమిటీ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. దీంతో ఈ బిల్లును గత ఏడాది నవంబర్లో బీజేపీ ఎంపీ జగదాంబిక పాల్, స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలోని కమిటీకి పంపారు. ఇప్పటికే ఈ వివాదాస్పద సవరణ బిల్లుపై రైతులు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నది. సవరణ బిల్లు ప్రకారం.. మొబైల్ ఆపరేటర్ల లాగే విద్యుత్తు సరఫరాను కూడా పలు ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారు. వివాదాస్పదమైన ఈ బిల్లును గత ఏడాది ఆగస్టులో కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల నిరసనల మధ్య బీజేపీ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది.