ముంబై, జూన్ 8: మహారాష్ట్రలో ‘మరాఠా రిజర్వేషన్ల’ ఉద్యమం మళ్లీ మొదలైంది. సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే శనివారం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. అయితే ఆయన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈసారి మరాఠా రిజర్వేషన్లను ప్రభుత్వం అమల్లోకి తీసుకురాకపోతే అక్టోబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని జరాంగే ప్రకటించారు. జూన్ 4లోగా రిజర్వేషన్ల అంశాన్ని తేల్చకపోతే తిరిగి నిరాహార దీక్షను మొదలుపెడతానని ఇంతకు ముందే ఆయన ప్రకటించారు.
మరాఠా రిజర్వేషన్ల కోసం రాష్ట్ర సర్కార్, విపక్ష మహా వికాస్ అఘాడీ ఏమీ చేయటం లేదని ఆయన విమర్శించారు. శివసేన (షిండే) నేతృత్వంలోని సర్కార్ రిజర్వేషన్ల అంశాన్ని తప్పుదారి పట్టిస్తున్నదని, మహా వికాస్ అఘాడీ అధికారంలో ఉండగా కూడా అదే పని చేసిందని జరాంగే ఆరోపించారు. ఈ ఏడాది ఆరంభంలో 17 రోజులపాటు జరాంగే ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతను తీసుకొచ్చింది. దీంతో మరాఠాలకు 10శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ మహారాష్ట్ర సర్కార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చింది. అయితే ఓబీసీ విభాగం కింద రిజర్వేషన్లు కల్పించడాన్ని జరాంగే వ్యతిరేకించారు.