న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రభుత్వ(సవరణ)-2023 బిల్లుపై మంగళవారం లోక్‌సభ అట్టుడికింది. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని ప్రతిపక్షాలు కేంద్రాన్ని విమర్శించాయి. సభ్యుల ఆందోళన నడుమే బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సభలో ప్రవేశపెట్టారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను బలవంతంగా లాక్కోవడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఈ సందర్భంగా విపక్ష సభ్యులు కేంద్రాన్ని విమర్శించారు. ఈ బిల్లుకు ఉన్న శాసన యోగ్యత ఏమిటని ఆర్ఎస్పీ ఎంపీ ప్రేమ్‌చంద్రన్, కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ప్రశ్నించారు. బిల్లుపై విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏకైక ఎంపీ సుశీల్ కుమార్ రింకూ మాట్లాడుతూ తనకు బిల్లుపై మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని…ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని.. అంబేద్కర్‌ను అవమానించడమేనని ఆక్రోశించారు. సభ్యులందరికీ బిల్లుపై మాట్లాడే అవకాశమిస్తానని స్పీకర్ ఈ సందర్భంగా వెల్లడించారు. లోక్‌సభలో ఢిల్లీ సర్వీసుల బిల్లు సులువుగా ఆమోదం పొందినా.. రాజ్యసభలో ఆమోదం పొందడం కష్టమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ బిల్లు చట్టమైతే ఢిల్లీ ప్రభుత్వ అధికారుల నియామకాల్లో కేంద్రానికే తుది నిర్ణయాధికారం దక్కుతుంది.
ఘోరం.. అప్రజాస్వామికం: ఆప్
ఢిల్లీ ఆర్డినెన్స్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లు పూర్తి అప్రజాస్వామికమని, సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకమని, ఇంత ఘోరమైన బిల్లును గతంలో ఎన్నడూ చూడలేదని ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ ఈ పరిపాలన సేవల నియంత్రణ బిల్లు గతంలో తెచ్చిన ఆర్డినెన్స్ కన్నా ఘోరంగా ఉందని విమర్శించారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కబళించి లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెట్టడానికే దీనిని తెచ్చారని విమర్శించారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ బిల్లును తిరస్కరించడానికి రాజ్యసభలో విపక్షాలకు కావాల్సినంత బలం ఉందని అన్నారు. దేశంలోని ఎంపీలందరూ దీనిని వ్యతిరేకించాలని ఆయన కోరారు.
మణిపూర్ అంశంపై దద్దరిల్లిన పార్లమెంట్
మణిపూర్ అంశంపై మంగళవారం పార్లమెంట్ దద్దరిల్లింది.మణిపూర్ అంశంపై చర్చించాలని.. ప్రధాని ప్రకటన చేయాలని లోక్‌సభలో విపక్షాలు ప్లకార్డులు ప్రదర్శించాయి. ఎంపీలు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. హర్యానా అల్లర్లను బీఎస్పీ ఎంపీ కున్వర్ దనిశ్ అలీ ప్రస్తావించారు. విపక్షాలు నిరసన కొనసాగించడంతో సభ బుధవారానికి వాయిదా పడింది. నిరసనల మధ్యే జనన, మరణ రిజిస్ట్రేషన్ల సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే మణిపూర్‌పై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేయగా చైర్మన్ నిరాకరించారు. సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. అనంతరం కూడా విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో సభ బుధవారానికి వాయిదా పడింది.