హైదరాబాద్, సెప్టెంబర్ 9 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కేంద్రంలోని ఎన్డీయే పాలనలో ధరాఘాతంతో పేద, మధ్యతరగతి ప్రజల జీవనం అస్తవ్యస్థమైంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో మోదీ సర్కారు వైఫల్యం.. సామాన్యుడి బతుకు చిత్రాన్ని ఛిద్రం చేస్తున్నది. గడిచిన మూడేండ్లలో ఇంటి ఖర్చులు భారీగా పెరిగిపోయాయని, నిత్యావసరాలను కూడా కొనలేకపోతున్నామని దేశంలోని 58 శాతం మంది ప్రజలు లబోదిబోమంటున్నారు. పొదుపు మాట అటుంచితే, పిల్లల స్కూల్ ఫీజుల కోసం కొత్తగా అప్పులు చేయాల్సిన దుస్థితి వాటిల్లిందని మెజార్టీ ప్రజలు వాపోతున్నారు. ఈ మేరకు మార్కెట్ రిసెర్చ్ సంస్థ ‘వరల్డ్ ప్యానెల్ బై న్యూమరేటర్’ తాజా సర్వేలో వెల్లడించింది.
ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకోవడంతో నిత్యావసరాల కోసం చేసే ఖర్చులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒక్కో ఇంటిలో సగటున చేసే త్రైమాసిక ఖర్చు మూడేండ్లలోనే 33 శాతం కంటే ఎక్కువగా పెరిగినట్టు ‘వరల్డ్ ప్యానెల్ బై న్యూమరేటర్’ సర్వేలో తేలింది. 2022లో త్రైమాసిక గృహ వ్యయం రూ. 42 వేలుగా ఉంటే, 2025నాటికి రూ. 56 వేలకు చేరుకొన్నట్టు సర్వే తెలిపింది. నిత్యావసరాల ఖర్చు పెరిగిపోతుండటంతో తక్కువ ఆదాయం కలిగిన పేద, దిగువ మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సర్వే అభిప్రాయపడింది. పాలు, పండ్లు, నూనె, బియ్యం, పప్పులు, సబ్బు వంటి నిత్యావసరాల ధరలు మండిపోతుండటంతో సామాన్యుల బడ్జెట్ గతి తప్పినట్టు సర్వేలో పాల్గొన్న మెజార్టీ ప్రజలు వాపోయారు. స్కూల్ ఫీజులు కూడా భారీగా పెరిగిపోవడంతో కొత్తగా అప్పులు చేయాల్సిన దుస్థితి వాటిల్లుతున్నట్టు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
ధరల కట్టడిలో కేంద్రం తీసుకొంటున్న చర్యలు సానుకూల ఫలితాలను ఇస్తాయని వినియోగదారులు విశ్వసించడంలేదు. ఆర్బీఐ మేలో విడుదల చేసిన కన్జూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్‌లో సూచీ విలువ 95.4కు పరిమితమవ్వడమే దీనికి రుజువు. దీన్ని ధ్రువపరుస్తూ.. ధరాఘాతం ఇలాగే కొనసాగితే, రానున్న మూడు నెలల్లో తమ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చని సర్వేలో పాల్గొన్న 59 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. దివాలానే తమకు శరణ్యమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకొనే చర్యలతో తమ ఆర్థిక భారం తగ్గొచ్చని 11 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేశారు.
పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవడానికి మార్కెట్లో చవగ్గా దొరికే వస్తువులను ఎంచుకొంటున్నట్టు, అత్యవసరమైతేనే ఆ వస్తువులను ఖరీదు చేస్తున్నట్టు ఏకంగా 80 శాతం మంది తెలిపారు. అదనపు ఆదాయం వస్తే, భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని పొదుపు చేస్తామని 54 శాతం మంది పేర్కొన్నారు. సర్వేలో మొత్తంగా 6 వేల మంది పాల్గొంటే, ప్రతీ ఏటా 14 శాతం మేర ధరలు పెరుగుతున్నాయని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారు. ధరాఘాతాన్ని తగ్గించడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెరిగిన ధరలతో తమకు ఏవైతే అవసరమో వాటినే ప్రజలు కొంటున్నారు. వృథా ఖర్చులు తగ్గాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. భవిష్యత్తు దృష్ట్యా పొదుపు చేయడం, అప్పులను తీర్చడంపై ప్రజలు దృష్టిసారిస్తున్నారు.
– కే రామకృష్ణణ్, ఎండీ, వరల్డ్‌ప్యానెల్ బై న్యూమరేటర్ (దక్షిణాసియా)