శివరాత్రి పర్వదినాన్ని పూర్తిగా ఉపవాసంతో జరుపుకొంటాం. లౌకికమైన ఆహార, విషయ వాంఛల నుంచి మనిషిని దూరంగా జరిపి, పరమేశ్వరుడికి చేరువ చేసే అంతరార్థం శివరాత్రి పర్వదినంలో కనిపిస్తుంది. లింగోద్భవం అర్ధరాత్రి వేళ జరిగింది. అంతా తానై, అన్నిటా తానై జగత్తును నడిపించే పరమేశ్వర లింగావిర్భావ పుణ్య సమయంలో శివధ్యానంతో మనసును నింపుకోనేందుకు జాగరణ రూపంలో ఏర్పరచుకున్న నియమం అది.
పరమేశ్వరుడి రాక కోసం ఒడలెల్లా కళ్లు చేసుకుని ఎదురుచూస్తూ, అనుక్షణం శివధ్యానంతో తపించేందుకు పెద్దలు ఏర్పాటుచేసిన ఆధ్యాత్మికమార్గం అది. మెలకువగా ఉన్నప్పుడు మాత్రమే ఇంద్రియాలు మన వశంలో ఉంటాయి. జ్యోతిస్వరూపుడైన పరమేశ్వరుడిని దర్శించటానికి భౌతిక నేత్రాలతోపాటు మనో నేత్రాలు కూడా అవసరం. అటువంటి మానసిక చైతన్యాన్ని ఎల్లప్పుడూ మనిషిలో నింపి ఉంచడంలో జాగరణ దోహదం చేస్తుంది.
మనిషిలో ఉండే అజ్ఞానానికి సంకేతం రాత్రి. జ్ఞానానికి పగలు ప్రతిరూపం. పరమేశ్వర తత్త్వాన్ని తెలుసుకోలేకపోవటమే అజ్ఞానం. ఈ మూడింటిని సమన్వయం చేస్తే శివతత్త్వాన్ని తెలుసుకోలేకపోవడం అనే అజ్ఞానం నుంచి మనిషిని దూరం చేసి, ఆత్మజ్ఞానం వైపు మనిషిని నడిపించేందుకు చేసే ప్రయత్నమే జాగరణ. రాత్రి తర్వాత వచ్చే పగలు ఆనందాన్నిస్తుంది. అలాగే, అజ్ఞానం తొలగిన తర్వాత వచ్చే విజ్ఞానం మనిషికి శాశ్వత ఆనందాన్నిస్తుంది. జ్ఞానమనే పగటి కోసం చూసే ఎదురుచూపే జాగరణ.
జాగరణ అనే పదానికి జాగృతం చేసుకోవడం అనే అర్థం కూడా ఉంది. మనలోని అచేతనాన్ని, దైన్యాన్ని స్వీయ జాగృతితో దూరం చేసుకోవాలి. నిరంతరం మెలకువగా (చైతన్యంగా) ఉండాలి. ‘యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం’ అని శంకరాచార్యులు చెప్పినట్లు చేసే ప్రతి పనిలోనూ, వేసే ప్రతి అడుగులోనూ పరమేశ్వర తత్త్వాన్ని భావించి, ఆధ్యాత్మిక జాగరణ కలిగి ఉంటే, శివానుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది.