బంజారా సమాజానికి ఆధ్యాత్మిక గురువుగా, సామాజిక సంస్కర్తగా పూజ్యనీయుడైన సేవాలాల్ మహారాజ్ జన్మదినం నేడు. సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని రాంజీనాయక్ తండాలో బంజారా (లంబాడీ) కుటుంబంలో సేవాలాల్ మహారాజ్ భీమానాయక్, ధరమణి మాతా దంపతులకు జన్మించారు. చెర్లోపల్లి పంచాయతీ పరిధిలోని గొల్లలదొడ్డి సమీపంలో ఆయన పుట్టిన పవిత్ర స్థలం ఉన్నది. సేవాలాల్ మహారాజ్ జన్మస్థలం చుట్టూ ఇప్పుడు ‘సేవా గడ్ మఠం‘ ఉన్నది, దీనిని బంజారాల ఆరాధ్య స్థలంగా కొలుస్తారు. 1806 డిసెంబర్ 4న మహారాష్ట్రలోని రుహిగడ్లో సేవాలాల్ మహారాజ్ సమాధి చెందారు.
సేవాలాల్ బాల్యంలోనే వేదాలు, శాస్ర్తాలు, అనేక భాషల్లో నిపుణుడయ్యారు. ఆయుర్వేదం, నేచురోపతి వంటి వైద్య విద్యల్లో నైపుణ్యం సాధించారు. సమాజంలో వ్యాపించిన మూఢాచారాలు, మంత్రతంత్రాలు, పశుబలులు వంటివాటిని వ్యతిరేకించారు. మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్తూ ఆదివాసీలు, గిరిజన జాతుల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. సేవాలాల్ మహారాజ్ హైదరాబాద్కు వచ్చి కలరా మహమ్మారిని నిర్మూలించారని, అందుకు గాను నిజాం పాలకులు బంజారాహిల్స్ ప్రాంతంలో సేవాలాల్ పశువుల మేతకు అనుమతి ఇచ్చారని చెప్తారు. ఆయన ఆత్మగౌరవం, సమానత్వం, ప్రకృతి పరిరక్షణ బోధనలు గిరిజన సమాజానికి మార్గదర్శకం.
నేడు బంజారా భవన్లో జరిగే సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఆయన ఆదర్శాలను స్మరించుకునే అవకాశం. ఆయన జీవితం గిరిజనులు, అటవీ నివాసులు, ఆదివాసీల సేవకు అంకితమైంది. సేవాలాల్ జయంతి సందర్భంగా ఆయన బోధనలు, సేవలు తెలంగాణలో గిరిజనుల సమస్యలు, ప్రభుత్వాల పాత్రలను పరిశీలిద్దాం. సేవాలాల్ మహారాజ్ ఆదర్శాలు నేడు కూడా గిరిజన సమాజానికి మార్గదర్శకం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మార్గానికి వ్యతిరేకంగా గిరిజనుల భూములు దోచుకుంటూ, హక్కులు కాలరాస్తూ అణచివేస్తున్నది. ఇది ఒక రాజకీయ దుర్మార్గం మాత్రమే కాదు, గిరిజన సమాజానికి చేస్తున్న ద్రోహం.
కేసీఆర్ పాలనలో గిరిజనుల స్వర్ణయుగం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సేవాలాల్ లాంటి దూరదృష్టితో గిరిజనుల సంక్షేమానికి విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు. సేవాలాల్ మహారాజ్ ఆదర్శాలకు అనుగుణంగా, గిరిజనుల భూమి, విద్య, ఉపాధి, రిజర్వేషన్ల కల్పన వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ సంక్షేమ పథకాలు తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖితమయ్యాయి. గిరిజనులకు ఆత్మగౌరవం, భరోసా కల్పించిన కేసీఆర్ మరో సంత్ సేవాలాల్, కుమ్రం భీమ్ లాంటి వారు.
ఎస్టీ రిజర్వేషన్ పెంపు: 2016లో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి, 6% నుంచి 10%కి పెంచారు. మద్యం లైసెన్సుల్లో 5% రిజర్వేషన్ కల్పించి 131 మంది గిరిజనులకు దుకాణాలు కేటాయించారు.
పోడు భూముల పట్టాలు: 1.5 లక్షల గిరిజన రైతులకు 4.06 లక్షల ఎకరాలు పంపిణీ చేశారు. ఇది దశాబ్దాల సమస్యను పరిష్కరించింది.
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం: 3,146 తండాలు, గూడాలు గ్రామ పంచాయతీలుగా మార్చారు. ఇది స్థానిక పాలన మెరుగుపరిచింది. వేలాది గిరిజన యువత సర్పంచులు, వార్డు మెంబర్లుగా ఎన్నికయ్యారు. ఎస్టీ సబ్ ప్లాన్, ఎస్టీలకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసి రూ.75,450 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.47,258 కోట్లు ఖర్చు చేశారు. దేశంలో తెలంగాణ మాత్రమే ఇలాంటి చిత్తశుద్ధి చూపింది.
టీఎస్ ప్రైడ్, పారిశ్రామికవేత్తలు: 13,264 గిరిజనులకు వ్యాపార సహాయం కోసం రూ.639.24 కోట్లు ఖర్చు చేశారు. చీఫ్ మినిస్టర్ ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ ఇన్నోవేషన్ స్కీమ్ ద్వారా 162 మందికి రూ.67.19 కోట్లు సబ్సిడీ ఇచ్చారు.
గురుకుల విద్యాలయాలు, విద్య: కేసీఆర్ హయాంలో 92 గురుకులాలు నెలకొల్పారు. 918 గిరిజన విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం పొందారు. 237 మంది విద్యార్థుల విదేశీ విద్యకు రూ.33.49 కోట్లు అందజేశారు.
సాంస్కృతిక భవనాలు, జయంతులు: బంజారా భవన్ (రూ.21.7 కోట్లు), కుమ్రం భీమ్ భవన్ (రూ.21.5 కోట్లు) నిర్మించారు. సేవాలాల్, కుమ్రం భీమ్ జయంతులు అధికారికంగా నిర్వహించారు. మేడారం జాతరకు రూ.354 కోట్లు ఖర్చు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాను కుమ్రం భీమ్ జిల్లాగా మార్చారు.
రేవంత్ పాలనలో గిరిజనుల అధోగతి: గిరిజనులకు అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఓట్లు దండుకున్నది. గెలిచాక వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా ప్రాజెక్టు పేరిట గిరిజనుల భూమిని లాక్కునేందుకు యత్నించింది. పోలీసులు మహిళలపై దాడులు, వేధింపులు, హింసకు పాల్పడ్డారు. 55 మందిని అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన మంచి పనులను కాంగ్రెస్ పాలకులు కొనసాగించాలి.
-డాక్టర్ కరాటే రాజునాయక్ ,95509 00009