మనదేశంలో ‘డేటింగ్’ అనేది మరింత ఆలోచనాత్మకంగా మారుతున్నది. ముఖ్యంగా, మహిళల్లో స్వీయ రక్షణకు ప్రాధాన్యతతోపాటు భావోద్వేగ పరిపక్వత కూడా పెరుగుతున్నది. డేటింగ్ విషయంలో కాస్త డేరింగ్‌ను ప్రదర్శిస్తున్నట్లు తాజా సర్వే ఒకటి బయటపెట్టింది. ప్రముఖ డేటింగ్ యాప్ ‘క్వాక్‌క్వాక్’.. భారతీయుల డేటింగ్‌కు సంబంధించి ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా.. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళల్ని ఎంపిక చేసింది. వివిధ పని నేపథ్యాల నుంచి వచ్చిన 9,685 మంది మహిళ అభిప్రాయాలను తెలుసుకున్నది.
ఈ సందర్భంగా 57 శాతం మంది మహిళలు.. తమ డేటింగ్ గురించి పునరాలోచిస్తున్నట్లు వెల్లడించారు. తమను తాము రక్షించుకోవడానికి, తమకు బాగా సరిపోయే వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నట్లు చెప్పుకొచ్చారు. మరికొందరు డేటింగ్‌తో లేనిపోని ఇబ్బందులు రావొద్దని, మానసిక ప్రశాంతతను మాత్రమే ఆశిస్తున్నట్లు తెలియజేశారు. ఇంకొందరు మాత్రం.. తమను తాము మరింతగా అర్థం చేసుకోవడానికి డేటింగ్ చేస్తున్నారట. ఇక డేటింగ్లో ఉన్నవారిలో అగ్రభాగం.. ఎదుటివారి ప్రొఫైల్స్‌లో నిజాయతీకే పెద్దపీట వేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోల్లోనూ.. సరళంగా, సహజసిద్ధంగా ఉన్నవాటినే ఇష్టపడుతున్నారు. నిజ జీవిత వివరాలనే పంచుకుంటున్నారు.
అదే సమయంలో భారతీయ యువత డేటింగ్ అలవాట్లు, సంబంధాలు, ప్రాధాన్యాలకు చెందిన విషయాలనూ పంచుకున్నది. యువతలో ‘డెడ్ ఎండింగ్’ అనే ధోరణి పెరుగుతున్నదని ఈ నివేదిక పేర్కొన్నది. తమ బంధం ముందుకు వెళ్లదని తెలిసినా, ఒంటరితనం భరించలేక, సమయం గడపడం కోసం ఆ బంధాన్ని అలాగే కొనసాగిస్తున్నారట. ఇక జెన్-జీలోనూ అధికభాగం.. నేరుగా కలవడానికి ముందే, వీడియో కాల్స్, చాటింగ్ ద్వారా అవతలి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల డేటింగ్లో మోసపోయే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన డేటింగ్ యాప్స్ వాడకం.. ఇప్పుడు టైర్-2, టైర్-3 నగరాల్లోనూ వినియోగదారులు గణనీయంగా పెరుగుతున్నారని తేల్చింది.