Congress | హైదరాబాద్, అక్టోబర్ 2 ( స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): బీసీలకు పెద్దపీట వేస్తామని నమ్మించిన కాంగ్రెస్ పార్టీ వారికి పెద్ద హ్యాండే ఇవ్వబోతున్నది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన బీసీ ముఖ్య నాయకుల బృందం అధిష్ఠానం వద్ద తమగోడు వెళ్లబోసుకుంటే న్యాయం జరుగుతుందని గుప్పెడు ఆశతో ఢిల్లీకి వెళ్లింది. ఐదు రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నా అధిష్ఠానం నుంచి స్పందన లేకపోవడంతో కొందరు నాయకులు హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. వీరిలో మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కూడా ఉన్నారు. పార్టీని నమ్ముకున్న తనకు అన్యాయమే జరిగిందంటూ పార్టీకి రాజీనామా చేశారు. రాహుల్‌గాంధీని కలిసినా ఫలితం లేకపోవడంతో బాధతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కన్నీటి పర్యంతమయ్యారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే అందులో బీసీలకు ప్రాధాన్యం లభించలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మొసలి కన్నీరు కార్చారు. పార్టీ ప్రకటించే జాబితాలో బీసీలకు పెద్ద పీట వేస్తామని రేవంత్ ప్రకటించారు. లోక్‌సభ నియోజకవర్గానికి రెండు సీట్ల చొప్పున కనీసం 34 సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తమ తరఫున ఎక్కువ సీట్ల కోసం రేవంత్‌రెడ్డి పోరాడతారని విశ్వసించినా, ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ గెలుపు గుర్రాల సాకుతో బీసీలకు కేటాయించాలనుకున్న సీట్లకు ఎసరు పెడుతున్నారన్న సమాచారం బయటికి పొక్కింది. అప్రమత్తమైన బీసీ ముఖ్య నాయకులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఏండ్ల తరబడిగా పార్టీని నమ్ముకుని, అధికారంలో లేకపోయినా తట్టుకొని నిలబడితే టికెట్లు దక్కకుండా ఢిల్లీలో జరుగుతున్న కుట్రలపై మండిపడ్డారు.
రాహుల్‌గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసి తమ గోడు వినిపించేందుకు ఐదు రోజుల క్రితం బీసీ ముఖ్య నాయకుల బృందం ఢిల్లీ వెళ్లింది. అధిష్ఠానం పెద్దల నుంచి స్పందన కరువవడంతో హతాశులైన కొందరు మనస్తాపంతో హైదరాబాద్‌కు తిరిగి రాగా మిగతా నాయకులు ఐదు రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు. అయినప్పటికీ ఖర్గే, రాహుల్‌గాంధీ నుంచి అపాయింట్మెంట్ లభించకపోవడంతో నిరాశ నిస్పృహలకు లోనైనట్టు సమాచారం. బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తామని బీరాలు పలికిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు మాట మార్చి, బీసీ నేతలకు టికెట్లు ఇస్తే ఓసీ అభ్యర్థుల కంటే గెలుపు అవకాశాలు తక్కువ అని సర్వేలో తేలిందని తాజాగా కొత్తరాగం అందుకున్నారు. తమను చివరిదాకా నమ్మించి గొంతు కోసింది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అని బీసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్ఠానం పట్ల తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న బీసీ నాయకులు మున్ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే రాజకీయ వర్గాలలో హాట్ టాఫిక్‌గా మారింది.