UCC | న్యూఢిల్లీ, జూన్ 29: జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఐదేండ్ల క్రితం యూసీసీని వ్యతిరేకిస్తూ తన నివేదికను వెలువరించింది. ఈ విధానం మన దేశానికి నప్పదని తేల్చిచెప్పింది. దీన్ని అమల్లోకి తీసుకొస్తే దేశ ప్రాదేశిక సమగ్రతపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. దేశంలోని భిన్న మతాచారాలను గౌరవించాలని ప్రభుత్వానికి సూచించింది. 2018 ఆగస్టు 31న విడుదల చేసిన నివేదికలో యూసీసీ అమలుకు ఎదురయ్యే ఇబ్బందులను లా కమిషన్ వివరించింది. ఈ దశలో భారత్‌లో యూసీసీ అమలు అవసరం లేదని అందులో పేర్కొన్నది. ‘భారత్‌లో చాలా రకాల సంస్కృతులు ఉన్నాయి.
యూసీసీ అమలు ప్రయత్నంలో నిమ్న వర్గాలను నిరాదరణకు గురిచేయవద్దు. వైరుధ్యాలను తొలగించడం అంటే వ్యత్యాసాన్ని రద్దు చేయటం కాదు. హిందూ లా ప్రకారం వివాహమనేది మతాచారం, క్రైస్తవ లా ప్రకారం విడాకులు అనేది కళంకం, ముస్లిం లా ప్రకారం వివాహమనేది ఓ ఒప్పందం, పార్సీ లా ప్రకారం వివాహ రిజిస్ట్రేషన్ వారి ఆచారం. వివిధ మతాలు ఆచరించే ఈ విధానాలను గౌరవించాలి. అన్నింటిని ఒకే చట్టం పరిధిలోకి తీసుకొస్తే ఒకరి ఆచారం మరొకరికి వ్యతిరేకంగా మారుతుంది. అన్నింటిని ఒకే చట్రంలోకి తీసుకురావడం అసాధ్యం. వివిధ మతాచారాలు వేరుగా ఉన్నంతమాత్రాన వివక్ష కాదు… ఇది ప్రజాస్వామ్యానికి సూచిక. యూసీసీపై ఏకాభిప్రాయం లేనప్పుడు వైరుధ్యమైన చట్టాలను పరిరక్షించడమే ఉత్తమ మార్గం’ అని పేర్కొన్నది. ముస్లిం చట్టాలపైనే ఎక్కువగా చర్చ నడుస్తున్నదని, ముస్లిం పర్సనల్ లా ప్రకారం బహుభార్యత్వం సరైనదే అయినా, భారత్‌లో అందరూ దాన్ని పాటించరని పేర్కొన్నది.
బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు తెరపైకి రాకుండా, రానున్న ఎన్నికల్లో అవి ప్రధాన ప్రచారాంశాలుగా మారకుండా ఉండేందుకు బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగానే వివాదాస్పద అంశాలను తెరపైకి తెస్తున్నది. రాజకీయ ఎజెండాలో భాగంగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంశాన్ని ప్రధాని మోదీ పదేపదే ప్రస్తావిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన బహిరంగ సభలో దీనిపై ప్రసంగించగా, తాజాగా బీజేపీ ముఖ్య నాయకులతో బుధవారం సుదీర్ఘ భేటీలోనూ దీనిపై చర్చించినట్టు సమాచారం. దేశంలో ఒక్కో పౌరుడికి ఒక్కో చట్టం ఉండటమేంటని మోదీ ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నాయని, ఓ వర్గాన్ని రెచ్చగొడుతున్నాయని భేటీలో మోదీ ప్రస్తావించినట్టు సమాచారం. ఎన్నికల వేళ వివాదాస్పద అంశాలను తెరపైకి తీసుకొస్తున్న బీజేపీపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. యూసీసీని గతంలో లా కమిషన్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేస్తున్నాయి.
ఎన్నికల వేళ ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని తెరపైకి తీసుకొస్తున్న ప్రధాని మోదీ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. హిందువులు, గిరిజనులు, ఈశాన్య రాష్ర్టాల సంస్కృతులను యూసీసీ పరిధిలోకి ఏ విధంగా తీసుకొస్తారని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రశ్నించారు. తొలుత లోక్‌సభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఆ తర్వాత యూసీసీ గురించి మాట్లాడాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ మోదీకి హితవు పలికారు. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే యూసీసీ అంశాన్ని మోదీ తెరపైకి తెచ్చారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. నాగాలాండ్‌లో బీజేపీ మిత్రపక్షమైన నేషనల్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) యూసీసీని వ్యతిరేకించింది. యూసీసీ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని తిరువనంతపురంలోని ఓ ప్రధాన మసీదు ఇమామ్ వీపీ సుహైబ్ మౌలావీ విమర్శించారు. జీవించే హక్కులను యూసీసీ హరిస్తుందని పేర్కొన్నారు.