Muda Scam | మైసూరు, నవంబర్ 27: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ముడా స్కామ్ కొత్త మలుపు తిరిగింది. సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి ముడా సేకరించిన భూమిలో తనకు కూడా వాటా ఉందని పేర్కొంటూ జమున అనే మహిళ స్థానిక కోర్టును ఆశ్రయించారు. మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల 16 గుంటల భూమిని అభివృద్ధి పనుల కోసం పార్వతి నుంచి ముడా సేకరించి, పరిహారంగా ఖరీదైన 14 ప్లాట్లను కేటాయించింది.
ఈ భూమిని దేవరాజు అనే వ్యక్తి నుంచి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామి కొనుగోలు చేసి ఆమెకు బహుమానంగా ఇచ్చారు. అయితే, ఈ భూమి తన తండ్రి మైలారయ్యది అని, ఇందులో తనకు కూడా వాటా ఉంటుందని జమున కోర్టులో సివిల్ దావా వేశారు. దేవరాజుకు జమున మేనకోడలు. ఈ భూమిపై వివాదం మొదలైన తర్వాత తనకు వాటా ఉందనే విషయం తెలిసిందని జమున పేర్కొన్నారు. కాగా, ఈ భూమిని ముడాకు ఇచ్చి, ఖరీదైన స్థలాలు పొందారనే ఆరోపణలతో సిద్ధరామయ్య, ఆయన భార్యపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లోకాయుక్త పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.