తిరువనంతపురం, మార్చి 23: కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్‌పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. బెంగళూరులోని రూ.200 కోట్ల విలువజేసే ఖరీదైన బంగ్లాకు సంబంధించి ఆస్తి వివరాల్ని రాజీవ్ చంద్రశేఖర్ దాచిపెట్టారని, ప్రజాప్రాతినిథ్య చట్టం కింద ఎన్నికల కమిషన్ ఆయనపై చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా ఆయనపై నిషేధం విధించాలని కాంగ్రెస్ ఈసీని కోరింది.
ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఆరోపణలపై రాజీవ్ చంద్రశేఖర్ ఇప్పటివరకు స్పందించలేదు. ఏప్రిల్ 9న జరుగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రాజీవ్ చంద్రశేఖర్ ‘నెమోమ్’ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసీకి ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, తనకు రూ.93 కోట్ల విలువజేసే స్థిరచరాస్తులున్నట్టు పేర్కొన్నారు. బెంగళూరులో రూ.15కోట్ల స్వార్జిత స్థిరాస్తి ఉన్నట్టు తెలిపారు.