పూరీ, జూలై 18: పూరీ జగన్నాథ్ ఆలయంలోని రత్న భాండార్‌లో ఉన్న ఆభరణాలను బయటకు తీశారు. 46 ఏండ్ల తర్వాత జూలై 14న మొదటిసారి రత్న భాండార్‌లోని లోపలి గదిని తెరిచిన దేవాలయ అధికారులు గురువారం మరోసారి తెరిచారు. అందులోని ఆభరణాలను ఆలయంలోని తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. ఈ ప్రక్రియకు ఏడు గంటల సమయం పట్టింది. మూడు చెక్క అల్మారాలు, రెండు చెక్క పెట్టెలు, ఒక స్టీల్ అల్మారా, ఒక ఇనుప పెట్టెలో ఆభరణాలను భద్రపరిచి సీల్ వేసినట్టు శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్(ఎస్జేటీఏ) చీఫ్ అరబింద పధీ తెలిపారు.
తాము రత్న భాండార్‌లో ఏయే ఆభరణాలు చూశామనేది బయటకు చెప్పబోమని తెలిపారు. రత్న భాండాగారానికి పురావస్తు శాఖ మరమ్మతులు చేపడుతుందని, అనంతరం ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ముందు జాగ్రత్తగా పాములను పట్టేవారిని, ఒడిశా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బందిని రప్పించినప్పటికీ వీరి అవసరం పడలేదు. చివరిసారిగా 46 ఏండ్ల కిందట రత్నభాండాగారాన్ని తెరిచారు.