న్యూఢిల్లీ: భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) మరింత పటిష్ఠం కానుంది. 17 వేల మందితో కూడిన 16 బెటాలియన్లను అదనంగా చేర్చడానికి బీఎస్ఎఫ్ సిద్ధమవుతున్నది. ఇప్పటికే 193 బెటాలియన్లతో ఉన్న బీఎస్ఎఫ్ శక్తి సుమారు 2.70 లక్షలకు చేరనుంది. అలాగే పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దులను కాపాడటానికి వరుసగా పశ్చిమ, తూర్పు కమాండ్ల కోసం రెండు ఫార్వర్డ్ హెడ్ క్వార్టర్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి తుది అనుమతి పొందేందుకు సిద్ధంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ ప్రణాళికలకు ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం లభించింది. ప్రస్తుతం మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దుల నుంచి నిత్యం సవాళ్లు ఎదురవుతున్న క్రమంలో బీఎస్ఎఫ్ పటిష్ఠతకు ఈ కొత్త బెటాలియన్లు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. కేంద్రం ఏర్పాటు చేయనున్న రెండు కమాండ్ బేస్‌లలో ఒకటి జమ్ములో, రెండోది బంగ్లాదేశ్ సరిహద్దు నిఘాకు మిజోరంలో ఏర్పాటు చేస్తారు.