(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 8(నమస్తే తెలంగాణ): పొద్దుతిరుగుడు విత్తనాలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసులు లాఠీలు ఝుళిపించారు. నీటి ఫిరంగులను ప్రయోగించి చెదరగొట్టారు. భారత్ కిసాన్ యూనియన్(చారుని) నాయకుడు గుర్నామ్ సింగ్ పిలుపు మేరకు హర్యానాలోని కురుక్షేత్రలో రైతులు తమ న్యాయమైన డిమాండ్ కోసం షహబాద్ వద్ద ఢిల్లీ – చండీఘడ్ జాతీయ రహదారి(ఎన్‌హెచ్ 44)ని దిగ్భందించారు.
ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జికి పాల్పడ్డారు. దీంతో పలువురు గాయాలవగా దవాఖానకు తరలించారు. ట్రాఫిక్‌ను సాఫీగా సాగనివ్వాలంటూ హర్యానా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వును ఆయన చూపుతున్నారు. రైతు నేతలు ఎంత చెబుతున్న వినకుండా తమ మాట పెడచెవిన పెట్టినందుకే రైతులను చెదరగొట్టడానికి నీటి ఫిరంగులను ప్రయోగించి, లాఠీఛార్జి చేయాల్సి వచ్చిందని చెప్పారు
అరెస్టు చేసిన రైతు నాయకుల్లో కొందరిని విడిచిపెట్టిన పోలీసులు గుర్నామ్ సింగ్ సహా తొమ్మిది మందిని 14రోజుల కస్టడీకి పంపించారు. కస్టడీకి పంపించిన రైతు నాయకులను వెంటనే విడుదల చేయాలని బికేయూ జాతీయ నాయకుడు రాకేష్ టికాయత్ డిమాండ్ చేశారు. లేకపోతే జూన్ 12న భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.