న్యూఢిల్లీ, డిసెంబర్ 23: మేక్ ఇన్ ఇండియా, కోట్ల ఉద్యోగాలు, లక్షల కోట్ల పెట్టుబడులు.. అబ్బో ఒక్కటేమిటి.. 2014లో మొదటిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ 130 కోట్ల భారతీయులకు అరచేతిలో స్వర్గమే చూపించారు. సరిగ్గా ఎనిమిదేండ్లు తిరిగేసరికి మేక్ ఇండియా ఫేక్ ఇన్ ఇండియా అయ్యింది. కోట్ల కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలకూ గ్యారెంటీ లేకుండా పోయింది. కొత్త పెట్టుబడుల మాటేమోగానీ, ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు కూడా బతుకుజీవుడా అంటూ దేశం నుంచి పారిపోతున్నారు. ఇందుకు సాక్ష్యమే ఎన్ఐఐఎఫ్. దేశంలోకి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామని గొప్పలు చెప్పుకొంటూ 2015లో ప్రధాని మోదీ ప్రారంభించిన భారతదేశ మొట్టమొదటి ప్రభుత్వరంగ పెట్టుబడి నిధే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్).
ప్రభుత్వం ఇటు..అధికారులు అటు
ఎన్ఐఐఎఫ్ పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వానికి, ఈ నిధిని పర్యవేక్షించే బోర్డుకు మధ్య పూడ్చలేనంత అగాథం ఏర్పడింది. దీంతో ఈ సంస్థతో కలిసి పనిచేసేందుకు విదేశీ పెట్టుబడిదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. ఈ ఫండ్లో కేంద్ర ప్రభుత్వం 49 శాతం వాటా తీసుకొని, మిగతా 51 శాతం వాటాను ప్రైవేటు పెట్టుబడి సంస్థలకు అప్పగించాలని మోదీ సర్కారు నిర్ణయించింది. అయినా ప్రైవేటు సంస్థల నుంచి పెద్దగా స్పందన రాలేదు. పెట్టుబడుల సేకరణ విషయంలో బోర్డుకు స్వేచ్ఛ ఇవ్వకుండా ప్రభుత్వం నిత్యం జోక్యం చేసుకోవటంతో విసుగెత్తిన, ఎన్ఐఐఎఫ్ మొదటి సీఈవో సుజయ్ బోస్.. ఆ పదవి నుంచి తప్పుకొన్నారు. దీంతో ఫండ్ పరిస్థితి గందరగోళంలో పడింది.
లక్ష్యం ఆకాశమంత.. రాబడి పాతాళమంత
ఈ ఫండ్ ద్వారా 2025 నాటికి దేశంలోని మౌలిక వసతులు, ఇతర రంగాల్లోకి విదేశాల నుంచి ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో లక్ష కోట్ల డాలర్ల నిధులను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. కానీ, 2015 నుంచి కష్టపడితే 2020 దాకా రాబట్టిన పెట్టుబడులు 568 మిలియన్ డాలర్లు మాత్రమే.