DGCA | తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందించింది. వాతావరణ రాడార్‌లో లోపం కారణంగా విమానాన్ని మళ్లించినట్లు పేర్కొంది. ఆదివారం సాయంత్రం కేరళ రాజధాని నుంచి జాతీయ రాజధానికి విమానం బయలుదేరగా.. చైన్నైలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ విమానంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఈ క్రమంలో సభ్యులు ఆందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో డీజీసీఏ వివరణ ఇచ్చింది. A320 విమానం VT-TNL విమాన ప్రయాణ సమయంలో సమస్య ఎదురైనట్లు డీజీసీఏ పేర్కొంది.
వాతావరణ రాడార్ సరిగ్గా పని చేయడం లేదని గుర్తించిన పైలట్లు విమానాన్ని చెన్నైకి మళ్లించారు. అంతకు విమానాన్ని తనిఖీ చేసిన సమయంలో ఎలాంటి లోపాలను గుర్తించలేదని పేర్కొంది. ముందు జాగ్రత్తగా డబ్ల్యూక్స్ రాడార్ ట్రాన్స్సీవర్ను పని చేసే పనిచేసే ట్రాన్స్సీవర్తో భర్తీ చేశారు. ఏటీసీ అనుమతి పొందిన తర్వాత విమానాన్ని చెన్నైకి తరలించారు. రాత్రి 22.39 గంటలకు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆదివారం ఢిల్లీ నుంచి బయలుదేరి AI2455 విమానం ఆలస్యంగా తిరువనంతపురం చేరుకుందని ఎయిర్ ఇండియా తెలిపింది. విమానాన్ని చెన్నైకి మళ్లించాలనే నిర్ణయం ముందుజాగ్రత్తల్లో భాగంగా తీసుకున్న నిర్ణయమని.. సాంకేతిక సమస్య ఉన్నట్లుగా అనుమానం ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు, సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రయాణికులందరినీ ఢిల్లీకి వెళ్లే ప్రత్యామ్నాయ విమానాలను అందుబాటులో ఉంచినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
అయితే, ఈ విమానం రాత్రి 7.15 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. 8.17 గంటలకు అంటే గంట ఆలస్యంగా విమానం బయలుదేరింది. అయితే, ఎంపీ కేసీ వేణుగోపాల్ ఈ అంశంపై స్పందించారు. ఎయిర్ ఇండియా విమానలో ప్రయాణం భయానకంగా మారిందన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అల్లకల్లోలాన్ని ఎదుర్కొన్నామన్నారు. విమానం బయలుదేరాక గంట తర్వాత సిగ్నల్ లోపం ఉన్నట్లుగా కెప్టెన్ ప్రకటించారని.. చెన్నైకి మళ్లించారని.. దాదాపుగా రెండు గంటలు విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు ఎదురు చూసినట్లు తెలిపారు. తొలిసారిగా ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో మరో విమానం రన్‌వే పై ఉందని తెలియడంతో గుండె ఆగిపోయినంత పనైందని.. కెప్టెన్ వేగంగా విమానాన్ని పైకి తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డామన్నారు. రెండోప్రయత్నంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని చెప్పారు. పైలట్ నైపుణ్యం వల్ల అదృష్టవశాత్తు బతికి బయటపడ్డామని.. ప్రయాణికుల భద్రత అదృష్టంపై ఆధారపడ కూడదన్నారు. ఈ ఘటనపై తక్షణం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.