(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర లేక ఒకవైపు రైతన్న రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నాడు. పెట్టుబడి వ్యయం పెరిగినా .. తగిన ఎమ్మెస్పీ ప్రకటించని కేంద్ర సర్కారుపై నిప్పులు చెరుగుతున్నాడు. అయినప్పటికీ, బీజేపీ ప్రభుత్వానికి అన్నదాతల గోస కనిపించట్లేదు. వ్యవసాయానికి బడ్జెట్లో కేటాయించిన అరకోర నిధులనూ ప్రభుత్వం ఖర్చు చేయట్లేదు. బడ్జెట్లో కేటాయించిన మొత్తం నిధుల్లో రూ. 44,015.81 కోట్ల నిధులను వ్యవసాయ శాఖ వెనక్కి తిరిగి ఇచ్చేసింది. తమ శాఖ నేతృత్వంలో చేపడుతున్న కార్యక్రమాలకు ఈ నిధులు అంతగా అవసరం లేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సోమవారం లోక్సభకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తెలిపింది.
అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఈశాన్య రాష్ర్టాల్లో సాగు విస్తీర్ణాన్ని ప్రోత్సహించడం, పేదరికంలో మగ్గిపోతున్న ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, ఆర్థిక చేయూత అందించడంలో భాగంగా తీసుకొచ్చిన ఎన్ఈఎస్ (నార్త్ ఈస్టర్న్ స్టేట్స్), ఎస్సీఎస్పీ (షెడ్యూల్ క్యాస్ట్ సబ్-ప్లాన్), ట్రైబల్ ఏరియా సబ్-ప్లాన్ (టీఏఎస్పీ) వంటి పథకాల అమలును ఈ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తుంది. అయితే, ఈ పథకాల అమలుకు బడ్జెట్లో కేటాయించిన నిధులను ఈ డిపార్ట్మెంట్ వెనక్కి తిరిగి ఇచ్చేసింది. 2020-21లో రూ. 23,824.54 కోట్లు, 2021-22లో రూ. 429.22 కోట్లు, 2022-23లో రూ. 19,762.05 కోట్ల చొప్పున మూడేండ్లలో మొత్తంగా రూ. 44,015.81 కోట్ల నిధులను వెనక్కి ఇచ్చేసింది. ఈ పథకాల అమలుకు ఈ నిధులు అంతగా అవసరంలేదని చెప్పుకొచ్చింది.
డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వైఖరిని స్టాండింగ్ కమిటీ తప్పుబట్టింది. పథకాలకు నిధులను ఖర్చుచేయకుండా మొత్తాన్ని వెనక్కి తిరిగి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అణగారిన వర్గాలకు ఉద్దేశించిన ప్రతీపైసా చివరి లబ్ధిదారుడికి చేరడానికి కృషి చేయాలని హితవు పలికింది. నిధులను వెనక్కి తిరిగిచ్చే పద్ధతిని మార్చుకోవాలని తేల్చిచెప్పింది. నిధులను సమర్థంగా వాడుకోవడానికి మార్గాలు అన్వేషించాలన్నది. ఈ మేరకు వ్యవసాయంపై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీ ఛైర్పర్సన్ పీసీ గడ్డిగౌదర్ నేతృత్వంలోని కమిటీ వ్యవసాయశాఖకు సూచించింది. కేంద్ర బడ్జెట్లో ఏటికేడాది డిపార్ట్మెంట్కు తగ్గుతున్న కేటాయింపులను కమిటీ ఈ మేరకు గుర్తుచేసింది.