న్యూఢిల్లీ, మే 1: దేశంలో ఓటర్ లిస్టులను మరింత పారదర్శకంగా ఉంచేందుకు భారత ఎన్నికల సంఘం నడుం బిగించింది. అందులో భాగంగా ఓటర్ లిస్టులను వేగంగా నవీకరించేందుకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి జనన, మరణాల జాబితాను ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ రూపంలో తీసుకుని ఓటర్ లిస్టులతో అనుసంధానించనున్నట్టు ఈసీ తెలిపింది. దీని వల్ల నమోదైన మరణాల గురించి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోలు) సకాలంలో సమాచారాన్ని పొందుతారని, మరణించిన వారి బంధువుల అధికారిక అభ్యర్ధన కోసం వేచి ఉండకుండా, బూత్ స్థాయి అధికారులు క్షేత్ర సందర్శనల ద్వారా సమాచారాన్ని తిరిగి ధ్రువీకరించడానికి వీలు కలుగుతుందని ఈసీ గురువారం తెలిపింది.
రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960, రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ చట్టం, 1969 ప్రకారం ఎన్నికల సంఘానికి అలాంటి వివరాలు కోరే హక్కు ఉంది. అలాగే పౌరులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఓటర్ సమాచార స్లిప్‌ల డిజైన్‌ను మార్చాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కొత్త డిజైన్‌లో ఓటర్ సీరియల్ నంబర్, పార్ట్ నంబర్లు మరింత స్పష్టంగా కన్పించేలా వాటి ఫాంట్ సైజ్‌ను పెంచుతారు.