న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికను సెప్టెంబర్ 9న నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఈ నెల 7న విడుదల చేస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపింది. ఒకవేళ ఎన్నిక అవసరమైతే సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ భవనంలోని మొదటి అంతస్తులో నిర్వహిస్తామని పేర్కొంది. గత నెల 21న జగ్దీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా, మరో ఇద్దరు అధికారులు ఆయనకు సహాయకులుగా ఉంటారని ఎన్నికల సంఘం తెలిపింది.
ఇక ఈ ఎన్నికలో రాజ్యసభ, లోక్సభకు చెందిన సభ్యులు ఓటర్లుగా ఉంటారని పేర్కొంది. రాజ్యసభకు నామినేట్ అయినవారు కూడా ఓటు వేయవచ్చని తెలిపింది. రాజ్యసభలో 233 మంది ఎన్నికైన సభ్యులు 12 మంది నామినేటెడ్ సభ్యులుండగా, లోక్సభలో 543 మంది మొత్తం 788 మంది ఓటర్లు. ప్రస్తుతం రాజ్యసభలో ఐదు, లోక్సభలో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలో 782 మంది ఓటు వేయనున్నారు. అందరూ ఓటు వేస్తే గెలిచే అభ్యర్థికి 391 ఓట్లు అవసరమవుతాయి.