మాల్డా : పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీఎంసీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దాడికి పదును పెట్టారు. ఉత్తర బెంగాల్లోని మాల్డా జిల్లాలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అక్రమ వలసదారులు పెద్దఎత్తున వస్తుండటంతో రాష్ట్ర జనాభా స్వరూపంలో సమతుల్యత దెబ్బతింటున్నదన్నారు.
అక్రమ చొరబాట్లు రాష్ర్టానికి అతిపెద్ద సవాల్ అని చెప్పారు. టీఎంసీ ప్రాపకం, సిండికేట్ రాజ్ కారణంగానే ఈ సమస్య తీవ్రమవుతున్నదన్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి కూడా చొరబాటుదారులను పంపించేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీకి అధికారాన్ని కట్టబెడితే, అక్రమ వలసలను ఆపేందుకు గట్టి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. భారత దేశంలో శరణార్థులుగా జీవిస్తున్న మటువా వంటి తెగలవారు ఆందోళన చెందనక్కర్లేదని భరోసా ఇచ్చారు.
తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం
మోదీ తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. ఇది హౌరా-గువాహటి మధ్య నడుస్తుంది. నాలుగు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు వర్చువల్ విధానంలో జెండా ఊపి, ప్రారంభించారు.