న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)లో 90 లక్షలకు పైగా ఓటర్ల పేర్ల తొలగింపు ప్రధాన రాజకీయ చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనుండగా టీఎంసీ, బీజేపీ, లెఫ్ట్, కాంగ్రెస్ వారి వారి సొంత ప్రయోజనాలకు అనుగుణంగా ఓట్ల తొలగింపు అంశాన్ని చర్చనీయాంశంగా మారుస్తున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంపీ ఎన్నికల కమిషన్‌పై యుద్ధం ప్రకటించగా, సర్ని బీజేపీ సమర్థిస్తూ ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారులను తొలగించడమే దీని లక్ష్యమని తెలిపింది.
ఓటర్ల జాబితా సవరణలకు అధికంగా ప్రభావితమైన మథువా జనాభా అధికంగా ఉన్న నాడియా జిల్లాలోని చక్దాహాలో ఓ ఎన్నికల సభలో మమత ప్రసంగిస్తూ పేర్ల తొలగింపులు యాదృచ్ఛికంగా కాని పరిపాలనపరంగా కాని జరిగినవి కావని ఆరోపించారు. బీజేపీకి రాజకీయంగా ఇబ్బందికరంగా కనిపించే మథువాలు, మైనారిటీలు వంటి సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమే ఈ తొలగింపులని ఆమె చెప్పారు. ఎందుకీ వివక్ష? మథువాలు, రాజ్‌బన్షీలు, మైనారిటీలను మీరు తొలగిస్తున్నారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోలేరని భావిస్తున్నారా? అని మమత కేంద్రాన్ని ప్రశ్నించారు.
భవానీపూర్‌లో మమతపై పోటీ చేస్తున్న బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి సర్ని సమర్థించారు. ముస్లిం చొరబాటుదారులను టీఎంసీ కాపాడుతున్నదన్న వాస్తవం సర్‌తో బయటపడిందని ఆయన చెప్పారు. తన చొరబాటుదారుల ఓటు బ్యాంకును సర్ బయటపెడుతున్నదని మమత భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. సర్‌ను ఓటర్ల బహిష్కరణ, వివక్షలుగా అభివర్ణించడానికి మమత ప్రయత్నిస్తుండగా ఎంతోకాలంగా జరగాల్సిన ప్రక్షాళన చర్యగా సర్ని చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది.
గతంలో అత్యధిక సంఖ్యలో పేర్లు మైనారిటీలు అధికంగా ఉన్న ముర్షిదాబాద్ నుంచి, ఆ తర్వాత మాల్దా, దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాల నుంచి విచారణకు వచ్చాయి. న్యాయ సమీక్ష తర్వాత 60 లక్షల విచారణ కేసులలో 27 లక్షలకు పైగా కేసులు కొట్టివేతకు గురై పేర్ల తొలగింపు జరిగింది. అయితే సంఖ్యాపరంగా చూస్తే మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, అత్యధిక శాతం తగ్గుదల నదియా, హుగ్లీ, ఉత్తర 24 పరగణాల జిల్లాల నుండే నమోదైంది. ఈ జిల్లాలోనే మథువా, శరణార్థుల రాజకీయాలు బీజేపీ-టీఎంసీ పోరుతో తీవ్రంగా ముడిపడి ఉన్నాయి.
సంక్షేమ విధానాల కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని మహిళలు మమతా బెనర్జీ పార్టీకి అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఇటీవల కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ పార్లమెంట్లో మాట్లాడుతూ ప్రతి 1000 మంది పురుషులకు మహిళల నిష్పత్తి 964కు పడిపోయిందని, గత 14 ఏండ్లలో ఇదే మొదటిసారని తెలిపారు. సర్‌కు ముందు ప్రతి 1,000 మంది పురుషులకు 969 మహిళలు ఉన్నట్లు గణాంకాలు చూపించాయి. మహిళా ఓటర్ల తగ్గుదల అధికార పార్టీకి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.