హైదరాబాద్, డిసెంబర్ 6 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): దేశీయ వైమానిక రంగంలో ఇండిగో గుత్తాధిపత్యం కారణంగానే ప్రస్తుత సంక్షోభం తీవ్ర రూపం దాల్చిందా? వైమానిక రంగం ఒక్కరిద్దరి చేతుల్లో ఉంటే ప్రమాదమని తెలిసినప్పటికీ కేంద్రం మౌన ముద్రను ఆశ్రయించిందా? ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్(ఎఫ్డీటీఎల్) నిబంధనల నేపథ్యంలో ప్రస్తుత సంక్షోభాన్ని కావాలనే తెర మీదకు తీసుకొచ్చారా? రూల్స్ సడలించడం వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? గడిచిన ఐదు రోజులుగా కొనసాగుతున్న ఇండిగో సంక్షోభంపై సర్వత్రా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2005లో ప్రారంభమైన ఇండిగో ఆ మరుసటి ఏడాదిలోనే కార్యకలాపాలను మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆ కంపెనీ దగ్గర 434 విమానాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 128 నగరాలకు రోజూ 2,300 సర్వీసులను ఆ సంస్థ నడుపుతున్నది. దేశీయ విమాన సర్వీసుల్లో ఇండిగో వాటా 63 శాతంగా ఉన్నది. అయితే, కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఎఫ్డీటీఎల్ నిబంధనలను పాటించడంలో ఇండిగో ఘోరంగా విఫలమయ్యింది. తాజా రూల్స్ ప్రకారం.. మరింత మంది పైలట్లు, సిబ్బందిని నియమించుకోవాల్సి ఉన్నప్పటికీ ఇండిగో తాత్సారం చేయడమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా వైమానిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశీయ వైమానిక రంగ మార్కెట్ వాటాలో 63 శాతంతో ఇండిగో మొదటి స్థానంలో ఉండగా, 20 శాతంతో ఎయిరిండియా గ్రూప్ రెండో స్థానంలో ఉన్నది. కేంద్రప్రభుత్వ విభాగమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులు ఇస్తేనే ఇండిగో సంస్థ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. అంటే, భారతీయ వైమానిక రంగంపై ఇండిగో వంటి ప్రైవేటు రంగ సంస్థ పైచేయి సాధించిందని, అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే, వైమానిక సంక్షోభమే తలెత్తే ప్రమాదం ఉన్నదని కేంద్రానికి తెలియంది కాదు. అయినప్పటికీ, ఇండిగో గుత్తాధిపత్యానికి చెక్ పెట్టే చర్యలను కేంద్రం తీసుకోలేదు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎఫ్డీటీఎల్ రెండో దఫా నిబంధనలను మరింత కఠినతరం చేసిన కేంద్రం.. దేశంలో అత్యధిక మార్కెట్ వాటా కలిగిన ఇండిగో ఈ రూల్స్‌కు సిద్ధమైందా? లేదా? అనే కోణంలో వివరాలు సేకరించలేదు. తీరా సంక్షోభం ముదిరాక.. ఇప్పుడు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌పై వేటు వేస్తామంటూ కేంద్రప్రభుత్వ వర్గాలు మీడియాకు లీకులు ఇవ్వడంపై నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్డీటీఎల్ రూల్స్ నుంచి మినహాయింపు కోసమే ఈ సంక్షోభాన్ని కృత్రిమంగా సృష్టించారా? విమాన సర్వీసుల రద్దు, జాప్యం వంటి చర్యలతో ప్రయాణికులను ఇబ్బందులపాలు చేసి.. తద్వారా నిబంధనల సడలింపు కోసం ప్రయత్నించారా? ఇండిగో సంక్షోభంలో జరుగుతున్న తాజా పరిణామాలను చూస్తే పలువురికి ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అనుమానాలకు బలం చేకూరుస్తూ.. ఇండిగో సిబ్బంది సంతకాలు చేసినట్టు చెప్తున్న ఓ లేఖ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సంక్షోభాన్ని సృష్టించి, డీజీసీఏ నిబంధనల సడలింపు కోసమే నిర్వహణ వైఫల్యాన్ని ఇండిగో ప్రతినిధులు తెర మీదకు తీసుకొచ్చారని ఆ లేఖలో ఉద్యోగులు ఆరోపించారు. ఇలా చేస్తే, కేంద్రం రూల్స్‌ను సడలిస్తుందని వారికి ముందే తెలుసునని కూడా చెప్పుకొచ్చారు. కాగా.. పెద్దమొత్తంలో విమాన సర్వీసులు నడిపేందుకు ఇండిగోకు కేంద్రం ఎడాపెడా అనుమతులు ఇవ్వడం, ఎఫ్డీటీఎల్ నిబంధనలను ఇండిగో కోసం కేంద్రం తాత్కాలికంగా సడలించడంపై ఇప్పుడు విశ్లేషకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్షోభం లోతుల్లోకి వెళ్తే మరిన్ని నిజాలు బయటపడే ఆస్కారం ఉన్నదని చెప్తున్నారు.