న్యూఢిల్లీ, జనవరి 25: నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే రూపాయి విలువ అత్యధికంగా క్షీణించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఏ ప్రధాని పదవీ కాలంలో రూపాయి విలువ ఎంత మేరకు తగ్గిపోయిందో చెప్తూ కాంగ్రెస్ శనివారం ఒక ట్వీట్ చేసింది. దాని ప్రకారం నరేంద్ర మోదీ పాలనలో రూపాయి విలువ 34.20 శాతం తగ్గిపోయింది.
అంతకుముందు మన్మోహన్ సింగ్ హయాంలో మన కరెన్సీ విలువ 15.56 శాతం తగ్గిందని తెలిపింది. ఇప్పటివరకు పని చేసిన ప్రధానుల్లో మోదీ హయాంలోనే రూపాయి విలువ అత్యధికంగా తగ్గిపోయిందని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనేట్ విమర్శించారు.