కాంగ్రెస్ అంటే ఏమిటీ?
కాంగ్రెస్ అంటే.. ఢిల్లీకి గులాంగిరీ
కాంగ్రెస్ అంటే.. అస్థిరత
కాంగ్రెస్ అంటే.. అవినీతి
ఈ విషయం మరోమారు రుజువైంది.
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి 75 రోజులైనా కాలేదు.. అప్పుడే ప్రభుత్వంలో అస్థిరత మొదలైంది. సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేయడం, అంతర్గత కుమ్ములాటలు వెరసి కాంగ్రెస్ అల్లకల్లోలం అవుతున్నది. పార్టీలో పంచాయితీని చక్కబెట్టుకోవడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం విఫలమవ్వడంతో ఢిల్లీ అధినాయకత్వం పెత్తనం మొదలైంది.
అలా.. కన్నడ ప్రజల ఆత్మగౌరవాన్ని రాష్ట్ర కాంగ్రెస్.. ఢిల్లీకి గులాంగిరీగా మార్చేసింది.!!
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలోని కర్ణాటక కాంగ్రెస్ సర్కారు అధికారాన్ని చేపట్టి 75 రోజులైనా పూర్తికాలేదు. అప్పుడే ప్రభుత్వంలో అస్థిరత మొదలైంది. సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే అవినీతి ఆరోపణలు వెలువడటం కాంగ్రెస్‌ను కకావికలం చేస్తున్నది. పార్టీలో అసమ్మతి, అంతర్గత కుమ్ములాటలు రాష్ట్ర సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. సమస్యలను పరిష్కరించడంలో భాగంగా గురువారం సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించినా ఫలితం దక్కలేదు. దీంతో ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలతో వచ్చే నెల 2న ఢిల్లీలో రెండు కీలక సమావేశాలను నిర్వహించనున్నది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ భేటీలు జరుగనున్నాయి. సమస్యల పరిష్కారానికి ఓ సమన్వయ కమిటీని ఈ భేటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ మధ్య వారధిగా ఈ కమిటీ పనిచేయనున్నట్టు సమాచారం. పార్టీలో అసమ్మతి, ప్రభుత్వ పటిష్టత, సర్కారు విధానాల అమలు, అవినీతి ఆరోపణలు వంటి అంశాలపై కూడా కమిటీ దృష్టిసారించనున్నట్టు తెలుస్తున్నది. మంత్రులు తమకు అందుబాటులో ఉండటంలేదంటూ ఇటీవల కొందరు శాసనసభ సభ్యులు ఆరోపించడం తెలిసిందే. దీనిపై కూడా భేటీలో మాట్లాడే అవకాశమున్నదని, కీలక నిర్ణయాల్లో సభ్యుల అభిప్రాయాలను తీసుకోవాల్సిందిగా అధిష్ఠానం మంత్రులకు సూచించనున్నట్టు సంబంధితవర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్‌కి ఓటు.. ఢిల్లీ చేతిలోకి రిమోటు
బీజేపీ 40 శాతం కమీషన్ సర్కారుతో విసిగిపోయిన కన్నడ ప్రజలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టంగట్టారు. అయితే, ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజునుంచే హస్తం పార్టీలో ఆధిపత్యపోరు మొదలైంది. సీఎం పీఠం ఎవరన్నదానిపై అధిష్ఠానం నిర్ణయం కోసం అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ హస్తిన చుట్టూ తిరిగారు. సీఎంగా సిద్ధరామయ్యను ప్రకటించడాన్ని శివకుమార్ పైకి స్వాగతించినప్పటికీ, లోలోన అసంతృప్తితో రగిలిపోతున్నారు. పరిపాలనలో అధిపత్య ప్రదర్శన కోసం శివకుమార్ తెర వెనుక తతంగాల్లో మునిగిపోవడమే ఇందుకు రుజువు. మంత్రివర్గం కూడా రెండుగా చీలిపోయినట్లు వ్యవహరించడం సర్కారులో కుదుపునకు కారణమైంది. అసలే అంతర్గత కుమ్ములాటలతో కుదేలైన ప్రభుత్వంపై స్వపక్ష ఎమ్మెల్యేలే అవినీతి ఆరోపణలు చేయడం, మంత్రుల వైఖరిని తప్పుబట్టడం సర్కారు అస్థిరతకు దారితీసింది.
కల్బుర్గి జిల్లా అళంద్ శాసనసభ్యుడు బీఆర్ పాటిల్ లెటర్ హెడ్ ఉదంతంతో సమస్య తీవ్రరూపం దాల్చింది. దీంతో ఇంటి సమస్యను చక్కబెట్టడానికి సిద్ధరామయ్య సీఎల్పీ భేటీ నిర్వహించారు. అయినప్పటికీ పరిష్కారమార్గం కనిపించలేదు. దీంతో ఈ అంశంలో ఢిల్లీ అధిష్ఠానం జోక్యం చేసుకొంది. అయితే, కర్ణాటక రాజకీయాలను ఢిల్లీలో చర్చించి, వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పాలన సాగించడానికి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవ్వడంపై కన్నడిగులు మండిపడుతున్నారు. ఢిల్లీ అంగట్లో మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. అందుకేనా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిందని రాష్ట్ర కాంగ్రెస్ సర్కారును నిలదీస్తున్నారు. ‘కాంగ్రెస్‌కు ఓటేస్తే.. రిమోట్ ఢిల్లీ చేతిలోకి వెళ్లినట్లేన’ని సోషల్‌మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు.