భుజంపై చెయ్యేసినట్టే కనపడుతూనే.. వెన్నుపోటు పొడవడం! అవకాశం దొరికితే వారిని అధికారానికి దూరం చేయడం! ఓడినచోట సహచరులకు చెయ్యిచ్చి మిత్రద్రోహానికి పాల్పడటం! ఇదీ ఇండియా కూటమి పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న కుటిలనీతి! తమిళనాడు తాజా పరిణామాలతో ఇది మరోసారి సుస్పష్టమైంది. అఖిలేశ్, తేజస్వీ, ఉద్ధవ్, కేజ్రీవాల్ ఇప్పటికే కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు బాధితులుగా మిగిలిపోగా.. ఇప్పుడు మమత, స్టాలిన్లకు తత్వం బోధపడుతున్నది!
హైదరాబాద్, మే 8 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): మంత్రి పదవుల కోసం 55 ఏండ్లుగా తమతో కొనసాగుతున్న డీఎంకేను కాంగ్రెస్ వెన్నుపోటు పొడించింది. దీంతో ఇలాంటి నమ్మక ద్రోహి నేతృత్వం వహిస్తున్న కూటమిలో మిత్ర పక్షాలుగా కొనసాగబోమని డీఎంకే తన అసమ్మతిని తెలియజేసింది. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులను విడిచిపెట్టడం కరెక్ట్ కాదంటూ మరో మిత్రపక్షం సమాజ్‌వాదీ పార్టీ హస్తానికి మొట్టికాయలు వేసింది. తాము ఓడితే సంబురాలు ఎలా చేసుకొంటారని తృణమూల్ కన్నెర్రజేస్తున్నది. మొత్తంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఇప్పుడు బీటలువారుతున్నది. హస్తం పార్టీ ఒంటరవుతున్నది.
మంత్రి పదవుల కోసం తమిళనాడులోని నటుడు విజయ్‌కు చెందిన టీవీకే పార్టీకి బుధవారం కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. దీనికోసం డీఎంకేతో 55 ఏండ్లుగా కొనసాగుతున్న సుదీర్ఘ పొత్తుకు గుడ్‌బై చెప్పింది. కాంగ్రెస్ తాజా నిర్ణయంపై డీఎంకే మండిపడింది. వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్‌తో ఇకపై కలిసి నడువబోమని తేల్చి చెప్పింది. ఆ పార్టీ నేతృత్వం వహిస్తున్న ఇండియా కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌తో తమ పొత్తు ముగిసిపోయిందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఎంపీల పక్కన కూడా తాము ఇకపై కూర్చోబోమని, తమకు లోక్‌సభలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు డీఎంకే ఎంపీ కనిమొళి లేఖ రాశారు. మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించకుండా గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారంటూ మయిలాదుతురైలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. అయితే, తమతో పొత్తులో ఉంటూ టీవీకేకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్‌పై అప్పటికే గుర్రుగా ఉన్న డీఎంకే కార్యకర్తలు తాజా ఆందోళనలపై భగ్గుమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను రోడ్ల మీద పరిగెత్తించి దాడులు చేశారు. కాంగ్రెస్ వెన్నుపోటుదారుల పార్టీ అంటూ నినాదాలు చేశారు.
డీఎంకేతో పొత్తును కాంగ్రెస్ వదులుకోవడాన్ని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తప్పుబట్టారు. కష్ట సమయాల్లో మిత్రులను విడిచిపెట్టి వెళ్లే వాళ్లం తాము కాదంటూ పరోక్షంగా కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. అంతేకాకుండా, ఇటీవల తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన డీఎంకే అధినేత స్టాలిన్, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీని స్వయంగా కలిసిన అఖిలేశ్ వారికి సంఘీభావం ప్రకటించారు. ఆ ఫొటోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ వైఖరిపై అసహనంతో ఉన్న ఎస్పీ.. ఇండియా కూటమిలో కొనసాగడం కష్టమేనంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొన్నటి బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మమత ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు. ఆ ఎన్నికల్లో టీఎంసీ పరాజయం పాలైతే కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకొన్నారు. దీనిపై మమత గుర్రుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న టీఎంసీపై కాంగ్రెస్ నేతల వైఖరిని మమత పరివారం తప్పుబడుతున్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే ఇండి కూటమిలో కొనసాగడంపై టీఎంసీ ఓ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
తాము నేతృత్వం వహిస్తున్న ఇండియా కూటమిలోని మిత్ర పక్షాలపై కూడా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ డైరెక్టుగా యుద్ధాన్ని ప్రకటించింది. రాష్ర్టాల ఎన్నికల సాకుతో మిత్ర పక్షాలను రాజకీయంగా దెబ్బతీయడం కాంగ్రెస్‌కు రివాజుగా మారింది. ఇండియా కూటమిలోనే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న లెఫ్ట్ పార్టీలపై కాంగ్రెస్ తీరు ఇలాగే ఉందనడానికి ఇటీవలి కేరళ ఎన్నికలే సరైన ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రభుత్వ ఏర్పాటుకు తెలంగాణలో లెఫ్ట్ పార్టీల మద్దతును కూడగట్టిన కాంగ్రెస్.. కేరళలో మాత్రం అదే వామపక్షాలపై కత్తులు దూసింది.
విజయన్ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ అధినాయకత్వంలోని పెద్దలు అందరూ నోరుపారేసుకొన్నారు. ఇక, పంజాబ్, ఢిల్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలో గతంలో మిత్రపక్షంగా ఉన్న ఆమ్ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టింది. దీంతో కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతూ ఇండియా కూటమి నుంచి నిరుడు ఆప్ బయటకు వచ్చింది. ఇప్పుడు మిగతా మిత్రపక్షాలు కూడా ఆప్ దారిలోనే నడుస్తూ.. ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పే అవకాశమున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.