న్యూఢిల్లీ: 53వ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ వచ్చే నెల 23న పదవీ విరమణ చేయనుండటంతో ఆయన తర్వాత సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆ పదవిలో నియమితులయ్యే అవకాశం ఉంది. సంప్రదాయం ప్రకారం, తదుపరి సీజేఐ పేరును సిఫారసు చేయాలని పదవీ విరమణ చేయబోతున్న సీజేఐని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కోరుతారు.
ప్రస్తుత సీజేఐ పదవీ విరమణ తేదీకి ఓ నెల ముందు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ లేఖ జస్టిస్ గవాయ్‌కి శుక్రవారం నాటికి చేరే అవకాశం ఉంది. సీజేఐ పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు. జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా నియమితులైతే, వచ్చే నెల 24న బాధ్యతలు చేపడతారు. 2027 ఫిబ్రవరి 9 వరకు, సుమారు 15 నెలలపాటు ఆ పదవిలో కొనసాగుతారు.