న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం మరోసారి సమర్థించింది. లోక్‌సభ, రాష్ర్టాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజాధనం ఆదా అవుతుందని పేర్కొన్నది. జమిలీ ఎన్నికలు వంటి భారీ ప్రక్రియను చేపట్టాలంటే రాజ్యాంగాన్ని సవరించడంతో పాటు ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయం తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని తెలిపింది.
ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు శుక్రవారం రాతపూర్వక సమాధానం ఇచ్చారు. జమిలి ఎన్నికల అంశంపై ఓ పార్లమెంటరీ కమిటీ పలు సిఫారసులు చేసిందని వెల్లడించారు. జమిలి ఎన్నికల నిర్వహణకు ఆచరణీయమైన రోడ్‌మ్యాప్, ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేందుకు తదుపరి పరిశీలన కోసం ఈ అంశాన్ని న్యాయ కమిషన్‌కు సిఫారసు చేసినట్టు వివరించారు.