హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): 11 ఏండ్ల ఎన్డీయే సర్కారు పాలన ‘కాకులను కొట్టి.. గద్దలకు వేసిన’ చందంగా తయారైంది. అత్తెసరు వేతనాలతో బతుకు బండిని నెట్టుకొచ్చే వేతన జీవులను ఓవైపు జీఎస్టీ పీల్చి పిప్పి చేస్తుంటే.. మరోవైపు ఆదాయ పన్ను నడ్డి విరుస్తున్నది. ఆదాయ పన్ను పేరిట ఒకవైపు వేతన జీవుల నడ్డి విరుస్తున్న కేంద్రం.. ఇదే సమయంలో సంపన్న వర్గాల ఆదాయంపై సర్ఛార్జీని తగ్గిస్తూ వారికి ట్యాక్స్ రిలీఫ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నది.
నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బులో.. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ప్రతి వస్తువుపై, ప్రతి సేవపై ఉద్యోగులు పన్ను కడుతూనే ఉన్నారు. దీనికి అదనంగా ఆదాయ పన్ను రూపంలో మరో భారం పడుతున్నది. ‘ఫైనాన్షియల్ అకౌంటబులిటీ నెట్ వర్క్ ఇండియా’ (ఎఫ్ఎన్ ఇండియా) రిపోర్ట్ ప్రకారం.. 2014-15లో గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో ఆదాయ పన్ను ద్వారా కేంద్రానికి 20.8 శాతం ఆదాయం రాగా.. 2024-25లో ఇది 30.2 శాతానికి చేరింది. 2024-25లో ఆదాయ పన్ను (ఐటీ) ద్వారా ఖజానాకు రూ.12,90,144 కోట్ల ఆదాయం సమకూరింది. దీనిని బట్టే ఐటీ బాదుడు ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇదే సమయంలో సంపన్నులకు మాత్రం పన్నులు తగ్గించి కేంద్రం ఊరట కల్పించడం విమర్శలకు తావిస్తున్నది. పదేండ్లలో కార్పొరేట్ పన్నులు 2.3 శాతం మాత్రమే పెరగ్గా, ఉద్యోగుల ఆదాయ పన్ను 4.5 శాతం పెరిగిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు.
ఆర్థిక నిపుణుల ప్రకారం.. ఒక ఉద్యోగి సంవత్సరానికి రూ.15 లక్షలు సంపాదిస్తే, అతడికి విధించే ఆదాయ పన్ను 15 శాతం. అంటే రూ.2.25 లక్షలు. అదనంగా జీఎస్టీ, పెట్రోల్ వాడితే వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, కారు వాడితే టోల్ ట్యాక్స్, సెస్, బ్యాంక్ చార్జీలు, ట్రాన్సక్షన్ ఫీజు, బ్యాంకు సర్వీస్ ట్యాక్స్, ఏదైనా స్థలం కొంటే రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ ఇలాంటివన్నీ చెల్లించాల్సి వస్తున్నది. ఇలా అన్ని రకాలుగా కలిపి ఏడాదికి రూ.2.75 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పన్నుల రూపంలోనే చెల్లించాల్సి వస్తున్నదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అంటే నెలకు రూ.25 వేల వరకు పన్నుల రూపంలో కడుతున్నట్టు పేర్కొంటున్నారు. కేంద్రం పన్ను వాయింపులకు తోడు మరోవైపు ధరలు విపరీతంగా పెరిగి పోతుండటంతో వేతన జీవులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్తున్నారు. వీటి ప్రభావం వారి కుటుంబాల జీవన ప్రమాణాలపై పడుతున్నదంటున్నారు.
సామాన్యుడైన వేతన జీవి నడ్డి విరిచి పన్నులు వసూలు చేస్తున్న కేంద్రం.. సంపన్న వర్గాలకు మాత్రం ట్యాక్స్‌ల చెల్లింపు విషయంలో ఉపశమనం కల్పించిందని నిపుణులు విమర్శిస్తున్నారు. 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సంపన్న వర్గాలకు ఆదాయంపై సర్ఛార్జీని గణనీయంగా తగ్గించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంపన్న వర్గాల ఆదాయంపై గతంలో 37 శాతంగా ఉన్న సర్ చార్జీ ప్రస్తుతం 25 శాతానికి తగ్గిందని చెప్తున్నారు. దీంతోపాటు ఆదాయ పన్నును సైతం 43 శాతం నుంచి 39 శాతానికి తగ్గించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఉద్యోగులపై భారం మోపుతూ, సంపన్నులకు వెసులుబాటు కల్పించడం ఏమిటని కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కార్పొరేట్ సంస్థలకు విధించే పన్నును సైతం కేంద్రం తగ్గించింది. 2014-15లో 34.5 శాతం ఉన్న కార్పొరేట్ ట్యాక్స్.. 2024-25లో 27.2 శాతానికి తగ్గించడమే ఇందుకు నిదర్శనం. మొత్తంగా కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వైఖరి కార్పొరేట్లకు కొమ్ముకాసే విధంగా ఉన్నదంటూ పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
పేద, మధ్యతరగతి వాళ్లను కొల్లగొట్టి కార్పొరేట్లకు కేంద్రం పెద్ద పీట వేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అన్నింటిపై పన్నులను విపరీతంగా పెంచింది. ఎక్కువగా పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు వస్తాయనే సాకుతో కార్పొరేట్ పన్నును విపరీతంగా తగ్గిస్తున్నది. గతంలో కార్పొరేటు పన్ను ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువగా వచ్చేది. అదే సమయంలో ఆదాయ పన్ను ద్వారా ఆదాయం తక్కువగా వచ్చేది. ప్రస్తుతం ఇందుకు భిన్నమైన పరిస్థితులు
– పాపారావు, ఆర్థిక విశ్లేషకుడు