Modi Cabinet | న్యూఢిల్లీ, జూన్ 9: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కొలువుదీరింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. మోదీ సహా 72 మందితో కేంద్ర క్యాబినెట్ కూడా ఏర్పాటైంది. ప్రధాని, మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. 30 మందికి క్యాబినెట్ మంత్రులుగా అవకాశం లభించింది. మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఐదేండ్ల తర్వాత మరోసారి క్యాబినెట్లోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. గత మంత్రివర్గంలో కీలక శాఖ బాధ్యతలు నిర్వర్తించిన రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ తదితరులు మరోసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.
రాజ్యసభ సభ్యులుగా ఉండి గత మంత్రివర్గంలో కొనసాగిన పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్ ఈసారి లోక్‌సభ సభ్యులుగా మంత్రివర్గంలో చేరారు. కాగా, జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలిచారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి మరోసారి మంత్రిగా అవకాశం లభించింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను సహాయ మంత్రిగా తీసుకున్నారు.
మోదీ గత క్యాబినెట్లో 10 మంది మహిళలు ఉండగా ఈసారి మాత్రం ఏడుగురికే అవకాశం లభించింది. కేంద్ర మంత్రులుగా నిర్మలా సీతారామన్, అన్నపూర్ణ దేవీ, సహాయ మంత్రులుగా శోభ కరంద్లాజే, రక్ష ఖడ్సే, సావిత్రీ ఠాకూర్, నిముబెన్ బంభానియా, అనుప్రియా పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. మాజీ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర మాజీ సహాయ మంత్రులు డాక్టర్ భారతి పవార్, సాధ్వీ నిరంజన్ జ్యోతి, దర్శన జర్దోశ్, మీనాక్షి లేఖి, ప్రతిమా భౌమిక్‌కు ఈసారి అవకాశం దొరకలేదు.
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఒంటరిగా మెజారిటీ దక్కని నేపథ్యంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీలపై బీజేపీ ఆధారపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో కూడా ఈసారి మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇచ్చింది. గత క్యాబినెట్లో ఒక్కరికి కూడా కేంద్ర మంత్రిగా అవకాశం దక్కలేదు. కేవలం సహాయ మంత్రి పదవులను మాత్రమే బీజేపీ ఇచ్చింది. ఈసారి మాత్రం 30 మంది క్యాబినెట్ మంత్రుల్లో ఐదుగురిని మిత్రపక్షాల నుంచి తీసుకున్నారు. జేడీఎస్, హెచ్ఏఎం(సెక్యులర్), జేడీయూ, టీడీపీ, ఎల్జేపీ(రామ్‌విలాస్) పార్టీల నుంచి ఒక్కొక్కరిని మంత్రులుగా అవకాశం కల్పించారు. స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా శివసేన నుంచి ఒకరికి, ఆర్ఎల్డీ నుంచి ఒకరికి చోటిచ్చారు. సహాయ మంత్రులుగా ఆర్పీఐ, అప్నాదల్(ఎస్), టీడీపీ, జేడీయూ, వీఐపీ నుంచి ఒక్కొక్కరి చొప్పున అవకాశం ఇచ్చారు.
కేంద్ర మంత్రివర్గ ప్రమాణస్వీకారం భారీ ఎత్తున జరిగింది. దాదాపు 9 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్(ప్రచండ), శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్‌సింఘే, మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మాద్ మొయిజ్జు, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్, భూటాన్ ప్రధాని త్సెరింగ్ తోబ్గే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మాద్ అఫీఫ్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలు, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, నటులు షారూఖ్ ఖాన్, రజినీకాంత్, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, రవీనా టాండన్, పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మోదీ ప్రభుత్వంలో కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో ప్రధాని మోదీతో కలుపుకుని ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులకు స్థానం దక్కింది. వీరిలో బీజేపీకే చెందిన ఐదుగురు, మిత్రపక్షాలకు చెందిన ఇద్దరు ఉన్నారు. కమలం పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హార్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, యూపీ మాజీ సీఎం రాజ్‌నాథ్ సింగ్, అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్‌లకు కేంద్ర క్యాబినెట్లో స్థానం దక్కింది. అలాగే ఎన్డీయే పక్ష పార్టీల నుంచి బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ, కర్ణాటకకు చెందిన మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఉన్నారు.
ఈసారి క్యాబినెట్లో 33 మంది కొత్త వారికి చోటు దక్కింది. 30 మంది మంత్రుల్లో ఏడుగురు కొత్త వారు. కాగా, కేంద్ర క్యాబినెట్లోకి 81 మందిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీతో సహా మొత్తం 72 మంది కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. మరో తొమ్మిది మందిని క్యాబినెట్లోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. క్యాబినెట్ విస్తరణ జరిపి ఈ పదవులను కూడా భర్తీ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. అయితే, గత క్యాబినెట్లో 78 మంది సభ్యులుగా ఉన్నారు.
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్రమోదీకి, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా పదవీ ప్రమాణం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తోపాటు ఇతర మంత్రివర్గ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్‌వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవంతంగా ఎన్డీయే ప్రభుత్వం కొనసాగుతూ ప్రజలకు మేలు చేయాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని హరీశ్‌రావు అభిలషించారు. తెలంగాణ అభివృద్ధికి దోహదపడే రీతిలో ప్రాజెక్టులు తెస్తూ, రాష్ర్టానికి అధిక నిధులు వచ్చేలా కృషిచేయాలని కోరారు.
మంత్రివర్గంలో ఉత్తరప్రదేశ్‌కు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ప్రధాని సహా పది మంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారికి మంత్రివర్గంలో చోటు లభించింది. ఆ తర్వాత బీహార్ నుంచి ఎనిమిది మంది, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ నుంచి ఐదుగురు చొప్పున, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి నలుగురు చొప్పున, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు చొప్పున, పశ్చిమ బెంగాల్, హర్యానా, తెలంగాణ, అస్సాం, జార్ఖండ్ నుంచి ఇద్దరు చొప్పున చోటు దక్కించుకున్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, గోవా, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక్కొక్కరికి చొప్పున చోటు లభించింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీకి చెందిన ఇద్దరికి, బీజేపీ ఎంపీ ఒకరికి మంత్రివర్గంలో చోటు లభించింది. శ్రీకాకుళంలో వరుసగా మూడోసారి గెలిచిన టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుకు మంత్రిగా అవకాశం దక్కింది. గుంటూరు నుంచి మొదటిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయమంత్రిగా చోటు దక్కింది. నర్సాపురం ఎంపీగా మొదటిసారి గెలిచిన భూపతిరాజు శ్రీనివాసవర్మ(బీజేపీ)కి కూడా సహాయమంత్రిగా అవకాశం కల్పించారు. కాగా, లోక్‌సభ సభ్యుల్లోనే కాక కేంద్ర మంత్రివర్గంలో కూడా అత్యంత ధనికుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ నిలిచారు. ఆయన తన కుటుంబానికి రూ.5,785.28 కోట్ల ఆస్తి ఉన్నట్టుగా ఎన్నికల అఫిడవిట్లో చూపిన సంగతి తెలిసిందే.
మోదీ నేతృత్వంలో కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గంలో ఓబీసీలు 27 మంది ఉన్నారు. జనరల్ క్యాటగిరీ నుంచి 25 మంది, ఎస్సీలు 10 మంది, ఎస్టీలు ఐదుగురు, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన్ మతాలకు చెందిన ఐదుగురికి క్యాబినెట్లో చోటు దక్కింది. కాగా, మోదీ మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా లేకపోవడం గమనార్హం.




