న్యూఢిల్లీ, జూన్ 24: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో భూకబ్జాకు పాల్పడ్డారని బీజేపీ బుధవారం ఆరోపించింది. వారిపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఆయన కుమారుడు, కర్ణాటక ప్రభుత్వంలో మంత్రి ప్రియాంక్ ఖర్గే తమకు చెందిన సిద్ధార్థ విహార ట్రస్టు ద్వారా కర్ణాటకలో భూముల లూటీకి పాల్పడ్డారని ఆరోపించారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా, రాహుల్ గాంధీ కుటుంబాన్ని ప్రేరణగా తీసుకుని వీరి భూకబ్జా సాగిందని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలను ప్రియాంక్ ఖర్గే ఖండించారు. ఆర్ఎస్ఎస్ను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నదని ఆయన తిప్పికొట్టారు. అయోధ్య రామాలయం లెక్కల గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారని, కాని బీజేపీ మాత్రం కలబురగిలోని బుద్ధ భగవానుడి నుంచి జవాబుదారీతనాన్ని డిమాండు చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్నదని ఆయన ఎద్దేవా చేశారు.