హైదరాబాద్, జూలై 25 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ప్రజల ఆహార భద్రతతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. ఎరువుల సబ్సిడీని అంతకంతకూ తగ్గిస్తూ అన్నదాతలపై అదనపు భారాన్ని మోపుతున్నది. ఎరువుల సబ్సిడీ తగ్గింపుతో సాగు భారం పెరిగి.. రైతులు వ్యవసాయానికి దూరమైతే.. దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదమున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై 21 వరకూ రూ. 49,330 కోట్ల నిధులను రైతులకు ఇచ్చే ఎరువుల సబ్సిడీ కింద కేంద్రం విడుదల చేసింది. ఇందులో రూ. 30,940.82 కోట్లను స్వదేశీ యూరియా కోసం, రూ. 4,006.7 కోట్లను దిగుమతి చేసుకొన్న యూరియా కోసం కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం లోక్సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. అయితే, దేశంలో వ్యవసాయ దిగుబడికి నైరుతి రుతుపవనాలే కీలకం. అలాంటి వానకాలం సమయంలో రైతులకు ఇచ్చే ఎరువుల సబ్సిడీ కేటాయింపులు ఇంత తక్కువగా ఉండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి గడిచిన కొన్నేండ్లుగా రైతులకు ఇచ్చే ఎరువుల సబ్సిడీని కేంద్రప్రభుత్వం అంతకంతకూ తగ్గిస్తూ వస్తున్నదని నిపుణులు చెప్తున్నారు. 2022-23లో ఎరువుల సబ్సిడీ కేటాయింపులు రూ. 2,54,798.88 కోట్లుగా ఉండగా, 2023-24నాటికి అవి రూ. 1,95,420.51 కోట్లకు తగ్గాయి. 2024-25లో ఈ కేటాయింపులు మరింతగా తగ్గి రూ. 1,77,129.50 కోట్లకు చేరినట్టు గణాంకాలను బట్టి తెలుస్తున్నది.
దేశంలోని రైతుల్లో 95 శాతం చిన్న, సన్నకారు రైతులే. వీరిపై ఎరువుల భారం పడకుండా చూసేందుకు దశాబ్దాల నుంచీ ప్రభుత్వాలు ఎరువులను సబ్సిడీపై అందిస్తున్నాయి. అయితే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ ఎరువుల సబ్సిడీకి అంతకంతకూ కోత పెడుతుండటంతో కోట్లమంది రైతులు సాగునుంచి దూరమయ్యే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే, దేశంలో ఆహార సంక్షోభం ఎదురయ్యే ప్రమాదం ఉన్నదని చెప్తున్నారు.