న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆరుస్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ విలేకరులతో మాట్లాడుతూ ‘ఢిల్లీలో మొత్తం ఏడు లోక్సభ నియోజకవర్గాలున్నాయి. వీటిలో ఆరు చోట్ల పోటీ చేయాలన్నది మా ఆలోచన. ఒక సీటును కాంగ్రెస్కు ఇస్తాం. ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్కు ఒక్క ఎంపీ కూడా లేరు. అసెంబ్లీలోనూ అదే పరిస్థితి.
ఇక కొద్ది రోజుల కిందట జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 250 సీట్లకుగానూ కాంగ్రెస్ గెలిచింది కేవలం 9 సీట్లే. వీటన్నింటినీ క్రోడీకరించి చూస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతున్నది. కాబట్టి 6 సీట్లలో మేము పోటీ చేసి మిగిలిన ఒక సీటును కాంగ్రెస్కు ఇస్తాం’ అని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ మండిపడింది. సీట్ల పంపకాలు తేలాల్సింది విలేకరుల సమావేశంలో కాదని వెల్లడించింది. కాగా పంజాబ్లో లోక్సభ స్థానాలకు తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్, కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఈ రెండు పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి.