Maharashtra | ముంబై, ఏప్రిల్ 20: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుందా? దశాబ్దాలుగా విరోధులుగా ఉన్న ఇద్దరు నేతలు మళ్లీ ఏకమవుతారా? అన్న చర్చ ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నది. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్‌ఠాక్రేలు మళ్లీ చేతులు కలుపబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర, మహారాష్ట్రీయుల ప్రాముఖ్యతతో పోలిస్తే ఉద్ధవ్‌తో తనకున్న విభేదాలు చాలా స్పల్పమని రాజ్ ఠాక్రే అన్నారు.
ఉద్ధవ్ స్పందిస్తే ఆయనతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమేనని ప్రకటించారు. దీనికి ఉద్ధవ్ కూడా సానుకూలంగా స్పందించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. దీనిపై ఉద్ధన్ సేన నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ.. రాజకీయ పొత్తుకు సంబంధించి ఎలాంటి చర్చలు జరుగలేదని, అయితే వీరి మధ్య భావోద్వేగ చర్చలు మాత్రమే జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే భవిష్యత్తులో రాజకీయంగా ఏకమవుతారా అన్న అంశాన్ని మాత్రం ఆయన తోసిపుచ్చలేదు.
ఈ ఇరువురు నేతలు తిరిగి కలిసిపోతున్నారంటూ వార్తలు రావడం ఇది తొలిసారి కాదు. గతంలో ఇదేవిధమైన ప్రచారం తీవ్రం గా జరిగింది. ఠాక్రే కుటుంబ సభ్యులు కూడా ఇద్దరినీ కలపడానికి పలు ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఫలించ లేదు. రాజ్ ఠాక్రే పార్టీ ఎన్నికల్లో సీట్లు గెలుచుకోలేక పోతుంది.