న్యూఢిల్లీ, డిసెంబర్ 21: క్రిస్మస్ సమీపిస్తున్న వేళ రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూరప్‌లో చర్చీలు ఖాళీగా కనిపిస్తున్నాయని, యువత తర్కం లేని, ఆధారాల్లేని మూర్ఖపు విశ్వాసాలను తిరస్కరిస్తున్నారని అన్నారు. మారుతున్న కాలానికి ఇది నిదర్శనమని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా హేతుబద్ధంగా ఆలోచించే యువత సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. ది లల్లన్‌టాప్ డిబేట్లో దేవుడు ఉన్నాడా? అనే అంశంపై మాట్లాడిన జావేద్ అక్తర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
వ్యవస్థీకృతమైన మత విశ్వాసాలను విమర్శనాత్మకమైన ఆలోచన విధానం, విద్యతో యువత తిరస్కరిస్తున్నారని తెలిపారు. ‘నమ్మకం అనే దానికి ఆధారం, సాక్ష్యం, హేతుబద్ధత, తర్కం ఉండదు. తర్కం, ఆధారం లేని విషయాన్ని మూర్ఖత్వం అంటారు. ప్రశ్నించడం ద్వారానే మానవ సమాజం ఎప్పుడూ పురోగతి సాధిస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు.