Indian Embassy | థాయ్‌లాండ్ (Thailand), కంబోడియా (Combodia)లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దుల పొడవున అనేక ప్రాంతాల్లో ఇరుదేశాలకు చెందిన సైనికుల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి (Border Tensions). ఈ భీకర ఘర్షణల్లో ఓ థాయ్ సైనికుడితోసహా 16 మంది మరణించారు. 15 మంది సైనికులతోసహా 46 మంది గాయపడ్డారు. సరిహద్దుల నుంచి 1.38 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు థాయ్ సైన్యం ప్రకటించింది. ఇరు దేశాల సైనికుల దాడులతో సరిహద్దు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
థాయ్‌లాండ్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణ నేపథ్యంలో కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీ చేసింది. థాయ్-కంబోడియా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కంబోడియాలో నివసిస్తున్న భారత ప్రజలు సరిహద్దులవైపు ప్రయాణించొద్దని సూచించింది. ఏదైనా అవసరమైతే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది. ఇందుకోసం హెల్ప్‌లైన్ నంబర్లను కూడా పంచుకుంది. ఏదైనా అవసరమైతే +855 92881676 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది. లేదంటే cons.phnompenh@mea.gov.inకు మెయిల్ చేయొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.
గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన ఘర్షణలు శుక్రవారానికి ఉధృతం కాగా రెండు దేశాలు తగ్గేందుకు ఏమాత్రం సిద్ధంగా లేవు. ఇరు దేశాలు తమ రాయబారులను పరస్పరం బహిష్కరించాయి. తాజా పరిస్థితలు నేపథ్యంలో కంబోడియా సరిహద్దుల్లోని 8 జిల్లాల్లో ఎమర్జెన్సీ విధించిన థాయ్‌లాండ్.. ప్రభావిత ప్రాంతాల్లో మార్షల్ లా కూడా విధించింది. సంక్షోభంపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. అమెరికా, చైనా, ఆసియన్ ప్రస్తుత అధ్యక్షురాలు మలేషియాతోసహా అంతర్జాతీయ జోక్యాన్ని థాయ్‌లాండ్ వ్యతిరేకించింది.
Also Read..
థాయ్-కంబోడియా ఘర్షణలు తీవ్రతరం
Thailand Clashes: కంబోడియాతో ఘర్షణ.. లక్ష మంది థాయ్ ప్రజలు తరలింపు
Cambodian Defense Ministry: శివాలయాలపై బాంబులు వేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలు: కంబోడియా రక్షణశాఖ