న్యూఢిల్లీ: కంబోడియా రక్షణ శాఖ(Cambodian Defense Ministry) ఇవాళ కీలక ప్రకటన చేసింది. థాయ్‌ల్యాండ్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు.. బోర్డర్ వద్ద ఉన్న ఆలయాలపై బాంబు దాడి చేసినట్లు పేర్కొన్నది. కంబోడియా భూభాగంలోకి చొరబడిన ఆ యుద్ధ విమానాలు.. నాలుగుసార్లు బాంబులు వేసినట్లు రక్షణ శాఖ ప్రతినిధి, లెఫ్టినెంట్ జనరల్ మాలీ సొచియాటా తెలిపారు. ఇవాళ మీడియాతో ఆ ప్రతినిధి మాట్లాడారు.
మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 12.40 నిమిషాల్లోపు థాయ్ ఫైటర్ విమానం ఆ బాంబు దాడి చేసినట్లు చెప్పారు. ప్రీహ్ వియార్ ఆలయం, వాట్ కియో శిఖ రికి స్వర్, తా క్రబే ఆలయంపై బాంబులను జారవిడిచినట్లు తెలిపారు. వాట్ కియా శిఖ రికి స్వరక్ ఆలయంపై రెండు సార్లు బాంబులు వేసినట్లు కంబోడియా రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. థాయ్‌ల్యాండ్ భారీ స్థాయిలో క్లస్టర్ బాంబులను వాడినట్లు కంబోడియా ఆరోపించింది. క్లస్టర్ బాంబుల వినియోగాన్ని కంబోడియా ఖండించింది. ఆ బాంబుల వల్ల లాంగ్ టర్మ్ డ్యామేజీ ఉంటుందని ప్రతినిధి తెలిపారు. అంతర్జాతీయ చట్టాలను థాయ్ ఉల్లంఘించినట్లు ఆరోపించారు. ఇది యుద్ధ నేరాల కిందకు వస్తుందన్నారు.
ప్రీహ్ వియార్ను హిందువుల ఆలయంగా గుర్తించారు. ఇక్కడ శివ లింగం ఉన్నది. ఇది చాలా ప్రాచీనమైంది. ఖైమర్ రాజులు దీన్ని నిర్మించారు. డాంగ్రేక్ పర్వత శ్రేణుల్లో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయం కంబోడియాలో ఉన్నట్లు హేగ్‌లోని అంతర్జాతీయ కోర్టు 1962లో తేల్చింది. 2008లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారు. ఇక్కడ శివుడిని శిఖరేశ్వరుడిగా, భద్రేశ్వరుడిగా పూజిస్తారు.
ప్రసాత్ తా క్రబే ఆలయాన్ని కూడా ఖైమర్ రాజులు నిర్మించారు. దీన్ని ప్రసాత్ తా ఖైవా అని కూడా పిలుస్తారు. అంగ్‌కార్ పాలకుల స్వర్ణయుగం సమయంలోనే ఈ వివాదాస్పద ఆలయం నిర్మించబడినది. హిందువులు పూజించే శివుడికి అంకితంగా ఈ ఆలయాన్ని 11వ శతాబ్ధంలో నిర్మించారు. కంబోడియాలో ఇటీవల ఈ ఆలయం టూరిస్టు కేంద్రంగా మారింది.