సురిన్: థాయ్‌ల్యాండ్, కంబోడియా మధ్య గురువారం తీవ్ర స్థాయిలో ఘర్షణలు(Thailand Clashes) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ దేశాల సరిహద్దులు రక్తసిక్తం అయ్యాయి. అక్కడ ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. సుమారు లక్ష మంది సాధారణ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు థాయ్‌ల్యాండ్ తెలిపింది. సుదీర్ఘమైన బోర్డర్ అంశంలో దశాబ్ధాలుగా సాగుతున్న ఘర్షణలు.. గురువారం కొత్త దశకు చేరుకున్నాయి. రెండు వైపుల నుంచి జెట్స్, యుద్ధ ట్యాంకులు, సైనిక బలగాలు రంగప్రవేశం చేశాయి. ఈ సంక్షోభాన్ని తప్పించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
బోర్డర్లో ఉన్న నాలుగు ప్రావిన్సుల నుంచి సుమారు లక్ష మందిని సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు థాయ్ హోంశాఖ తెలిపింది. సుమారు 300 పాక్షిక షెల్టర్లను ఏర్పాటు చేశారు. సాధారణ పౌరులు మృతిచెందిన సంఖ్య 14కు చేరుకున్నది. కంబోడియాలో బోర్డర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమరాంగ్ పట్టణంలో శుక్రవారం కూడా ఫైరింగ్ వినిపించినట్లు అంతర్జాతీయ జర్నలిస్టులు పేర్కొన్నారు. థాయ్‌తో జరిగిన ఘర్షణల్లో ఓ కంబోడియా పౌరుడు, ఇతరులు అయిదుగురు చనిపోయినట్లు అధికారులు చెప్పారు.
రెండు దేశాల మధ్య సుమారు 800 కిలోమీటర్ల బోర్డర్ ఉన్నది. 2008, 2011లో పలుమార్లు బోర్డర్ ఘర్షణలు జరిగాయి. 2013లో ఐక్యరాజ్యసమితి సమస్యను పరిష్కరించేందుకు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. కానీ తాజాగా మే నెలలో మళ్లీ వివాదం రాజుకున్నది. కంబోడియా సైనికుడు ఒకరు మృతిచెందడంతో .. ఘర్షణలు తారా స్థాయికి చేరాయి.
గురువారం మొత్తం ఆరు ప్రదేశాల్లో ఫైటింగ్ జరిగింది. రెండు ఆలయాలు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నట్లు థాయ్ ఆర్మీ తెలిపింది. ట్యాంకులతో థాయ్ ఆర్మీ కంట్రోల్ కోసం ప్రయత్నించింది. మరో వైపు కంబోడియా రాకెట్లను థాయ్ భూభాగంలోకి ఫైర్ చేసింది. కంబోడియా మిలిటరీ టార్గెట్లను పేల్చేందుకు ఎఫ్-16 యుద్ధ విమానాలను థాయ్ రంగంలోకి దింపింది.