న్యూఢిల్లీ: థాయ్లాండ్, కంబోడియా మధ్య జరుగుతున్న భీకర ఘర్షణల్లో ఓ థాయ్ సైనికుడితోసహా 16 మంది మరణించారు. 15 మంది సైనికులతోసహా 46 మంది గాయపడ్డారు. సరిహద్దుల నుంచి 1.38 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు థాయ్ సైన్యం ప్రకటించింది. గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన ఘర్షణలు శుక్రవారానికి ఉధృతం కాగా రెండు దేశాలు తగ్గేందుకు ఏమాత్రం సిద్ధంగా లేవు. ఇరు దేశాలు తమ రాయబారులను పరస్పరం బహిష్కరించాయి.
కంబోడియా సరిహద్దుల్లోని 8 జిల్లాల్లో ఎమర్జెన్సీ విధించిన థాయ్లాండ్.. ప్రభావిత ప్రాంతాల్లో మార్షల్ లా కూడా విధించింది. సంక్షోభంపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. అమెరికా, చైనా, ఆసియన్ ప్రస్తుత అధ్యక్షురాలు మలేషియాతోసహా అంతర్జాతీయ జోక్యాన్ని థాయ్లాండ్ వ్యతిరేకించింది.