ముంబై, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఠాక్రే సోదరులు ఏకమయ్యారు. విభేదాలతో విడిపోయిన శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే బుధవారం ఒకే వేదికపై కన్పించారు. వచ్చే నెలలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సోదరుల కలయిక మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలకు పూర్తిగా కొత్త రూపాన్ని ఇవ్వనుంది. మున్సిపల్ ఎన్నికలకు ఈ కూటమి చాలా కీలకంగా మారనుంది. ముఖ్యంగా ముంబై, థాణె, పుణె, నాసిక్ వంటి పట్టణ ప్రాంతాల్లో ఈ కూటమి పెద్ద ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు.