భూతల స్వర్గం జమ్ముకశ్మీరులో రక్తపుటేరులు పారాయి. మినీ స్విట్జర్లాండ్‌గా పిలుచుకునే పహల్గాంలోని బైసరాన్ కాల్పుల మోతతో దద్దరిల్లింది. విహార యాత్ర కోసం వచ్చిన పర్యాటకులకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ప్రకృతి అందాలను చూసి పరవశించి సేద తీరుతున్న పర్యాటకులపై మంగళవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.
ఎవరు, ఎందుకు చంపుతున్నారో అర్థం గాక పర్యాటకులు నిశ్చేష్టులయ్యారు. తేరుకునే సరికి పలువురు రక్తపు మడుగులో విగత జీవులై కనిపించారు. నిమిషాల్లో అంతా జరిగిపోయింది. వచ్చిన దారిలోనే ఉగ్రవాదులు అడవిలోకి పారిపోయారు. ఊరుకాని ఊరిలో, భాష రాని ప్రాంతంలో తమ వారిని కాపాడుకునేందుకు సహాయం కోసం బాధితుల కుటుంబసభ్యులు ఆర్తనాదాలు చేశారు. కాపాడేందుకు అక్కడ దవాఖాన లేదు. డాక్టర్లు అంతకన్నా లేరు. పహల్గాం చేరుకోవడానికి వాహనాలు కూడా సమీపంలో లేవు. ఎక్కడ చూసినా పిట్టల్లా రాలిపోయిన పర్యాటకులతో ఆ ప్రదేశం మరుభూమిని తలపించింది. సైనిక హెలికాప్టర్లు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను తరలించే వరకు అక్కడ భయానక వాతావరణం నెలకొన్నది. ఉగ్రతూటాలకు 26 మంది మరణించగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మళ్లీ నెత్తురోడింది. ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. ఈ అమానవీయ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీశ్ రంజన్, ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.
విచక్షణారహితంగా కాల్పులు..
ఫుడ్‌స్టాల్స్ వద్ద కొందరు, గుర్రాలపై స్వారీ చేస్తూ కొందరు, పచ్చిక బయలుపై కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరి కొందరు పర్యాటకులు ఉన్న సమయంలో అడవిలో నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమైన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి కంటికి కనిపించిన పురుషులను కాల్చుకుంటూ పోయారు. ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్చవద్దని మహిళలు వేడుకుంటున్నా వారు కనికరించలేదు. ఇతను ముస్లిం కాదు.. కాల్చేయండి అని ఓ ఉగ్రవాది అన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. భర్తను, ఆప్తులను కోల్పోయిన చాలా మంది మహిళలు సాయం కోసం స్థానికులను అర్థించే దృశ్యాలు వైరల్ అయ్యాయి. పోనీలు, ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నందున క్షతగాత్రులను తరలించడానికి సైనిక హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. భద్రతా ఏర్పాట్ల మధ్య ఇతర పర్యాటకులను అక్కడి నుంచి అధికారులు తరలించారు.
మోదీకి పోయి చెప్పు
పహల్గాం వద్ద ఉగ్రదాడిలో కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మరణించారు. మంజునాథ్ రావు తనభార్య, చిన్న కుమారుడితో కలసి విహార యాత్ర నిమిత్తం బైసరన్ ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడ సేదతీరుతున్న మంజునాథ్‌ను ఉగ్రవాదులు తుపాకీతో కాల్చిచంపారు. ఈ దారుణ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన మంజునాథ్ భార్య పల్లవి ఆ భయానక అనుభవాన్ని మీడియాకు వివరించారు. ‘నేను, నా భర్త, నా చిన్న కుమారుడు కశ్మీరుకు వెళ్లాము. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మేము పహల్గాంలో ఉన్నాము. ముగ్గురు, నలుగురు సాయుధులు మాపైన దాడి చేశారు. నా భర్తపై కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే మరణించారు. నా భర్తను చంపేశారు.. నన్ను కూడా చంపేయండి అని వారిని అర్థించాను. నిన్ను చంపము. ఈ విషయాన్ని మోదీకి చెప్పు అని వారిలో ఓ వ్యక్తి అన్నాడు’ అని పల్లవి తెలిపారు.
నా భర్తను కాపాడండి
పహల్గాం సమీపంలోని బైసరన్ వద్ద పచ్చికబయళ్లు రక్తపుటేరుగా మారాయి. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలు, వాటి వద్ద మహిళలు విలపిస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాను వణికించాయి. తన భర్త తలలో తూటా దిగిందని, ఆయనను కాపాడండి అంటూ ఓ మహిళ నిస్సహాయంగా అర్థిస్తున్న దృశ్యం ఓ వీడియోలో కనిపించింది. తాను భేల్‌పూరీ తింటుండగా ఓ సాయుధుడు తన భర్త వద్దకు తుపాకీతో కాల్చివేసినట్లు మరో మహిళ తెలిపింది. ‘ఇతను ముస్లిం కాదు.. కాల్చివేయండి’ అని ఆ ఉగ్రవాది అన్నాడని ఆ మహిళ వివరించడం మరో వీడియోలో కనిపించింది. మరో వీడియోలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి నేలపై పడి ఉన్న తన భర్తను లేపడానికి ప్రయత్నిస్తూ దయచేసి ఎవరైనా సాయం చేయండి అంటూ అర్థించడం కనిపించింది.
శ్రీనగర్ చేరుకున్న అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీనగర్‌కు చేరుకున్నారు. అంతకుముందు, సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి కశ్మీరులో కాల్పుల ఘటన సమాచారాన్ని అమిత్ షా తెలియజేశారు.
ఈ అమానవీయ చర్య క్షమించరానిది: రాష్ట్రపతి ముర్ము
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం దిగ్భ్రాంతికరం, బాధాకరమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. అమాయకపు పౌరులను లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దుర్మార్గపు అమానవీయ చర్య క్షమించరానిదని అన్నారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వదలిపెట్టబోం: మోదీ
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో తమ ఆప్తులను కోల్పోయిన వారికి ఆయన సంతాపాన్ని తెలియచేశారు. క్షతగాత్రులు త్వరితంగా కోలుకోవాలని సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందచేయడం జరుగుతోందని, ఈ దారుణానికి ఒడిగట్టినవారిని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. వారి దుష్ట పన్నాగం ఎన్నటికీ నెరవేరదని, ఉగ్రవాదంపై తాము సాగిస్తున్న పోరాటం మరింత శక్తితో సాగుతుందని ఆయన తెలిపారు.
దేశంలో ప్రధాన ఉగ్రదాడులు ఇవీ..
ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ఏర్పాటు
పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు, ఇతర టూరిస్టుల కోసం రోజంతా అందుబాటులో ఉండే విధంగా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం హెల్ప్‌లైన్ డెస్క్‌ను తీసుకొచ్చింది. ‘టూరిస్టులు 0193222337, 7780885759, 9697982527, 6006365245 ఫోన్ నంబర్లను సంప్రదించటం ద్వారా ప్రభుత్వ సాయం, ఇతర సమాచారాన్ని పొందవచ్చు. అనంత్‌నాగ్ జిల్లా అధికారులతో ఈ ఎమర్జెన్సీ హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేశాం’ అని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీనగర్‌లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, సాయం కోసం టూరిస్టులు 01942457543, 01942483651, 7006058623 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
పాక్‌కు వ్యతిరేకంగా నిరసనలు
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై జమ్ముకశ్మీర్‌లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జమ్ము నగరంలో, దోడా జిల్లాలో నిరసనలు చోటుచేసుకున్నాయి. జమ్ముకశ్మీర్ నుంచి ఉగ్రవాదుల్ని పూర్తిగా ఏరివేయాలని రాష్ట్రీయ బజ్రంగ్ దళ్ కార్యకర్తలు జమ్ములో ఆందోళనకు దిగారు.