న్యూఢిల్లీ, మే 5 : పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులు అడవులు, పర్వతాల్లో స్థావరాలు నిర్మించుకొని మాటు వేయటంలో నిపుణులని తేలింది. జమ్ము కశ్మీర్ జైళ్లలోని టెర్రరిస్టుల ఇంటరాగేషన్లో ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పర్వత ప్రాంతాల్లో రహస్య స్థావరాల నిర్మాణంలో ఉగ్రవాదులకు పాక్ ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. రోజుల తరబడి అడవుల్లో దాక్కొని జీవించడం ఎలానో కూడా వీరికి నేర్పించారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి అడవుల్లో బయటపడ్డ ఉగ్రస్థావరాల్ని భద్రతా బలగాలు గుర్తించాయి. బైసరన్ లోయ చుట్టూ ఉన్న మార్గాలను పూర్తిగా జల్లెడ పడుతున్నాయి. ఈ లోయ నుంచి మొదలయ్యే 54 మార్గాలను గుర్తించి తనిఖీలు చేపట్టాయి. ఉగ్రవాదులకు లాజిస్టిక్స్(సామాగ్రి) సాయం చేసిన కొందరు ఓవర్ గ్రౌండ్ వర్కర్లను అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు..వారిని వెంటబెట్టుకొని ఈ మార్గాలను గాలిస్తున్నాయి.