Rajori | పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదిని భారత సైన్యం హతమార్చింది. మంగళవారం రాజౌరీ కేరీ సెక్టార్లోని బరాత్ గాలా ప్రాంతంలో ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన సైనికులు కాల్పులు ప్రారంభించారు. ఆ తర్వాత సంఘటనా స్థలాన్ని పరిశీలించగా.. నియంత్రణరేఖ సమీపంలో ఓ ఉగ్రవాది మృతదేహం పడి ఉన్నది. మిగతా ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయినట్లుగా భద్రతా బలగాలు తెలిపాయి. సమాచారం ప్రకారం.. ఉదయం 8-9గంటల మధ్య భారత సైన్యం బరాత్ గాలా ప్రాంతంలోని రేఖ వెంబడి అనుమానాస్పద కదలికలను గమనించారు.
చొరబాటు ప్రయత్నాలను గుర్తించిన వెంటనే.. అప్రమత్తమైన సైనికులు కాల్పులు ప్రారంభించారు. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నం విఫలం చేసిన అనంతరం సైన్యం ఆ ప్రాంతంలో భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తి కనిపిస్తే వెంటనే సైన్యానికి తెలియజేయాలని స్థానిక ప్రజలకు సైన్యం విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా.. జూన్ 15 అర్ధరాత్రి కూడా చొరబాటు ప్రయత్నం జరిగింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ ప్రాంతంలో ఇది రెండవ చొరబాటు ప్రయత్నం. జూన్ 15 అర్ధరాత్రి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదుల అదే ప్రాంతంలో చొరబడటానికి ప్రయత్నించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో అప్రమత్తమైన సైనికులు కూడా ఆ ప్రయత్నాన్ని విఫలం చేశారు.