Jammu | నిషేధిత ఉగ్రవాద సంస్థలు జైష్ ఏ మొహ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్‌తో సంబంధం ఉన్న ఓ అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను జమ్మూ కశ్మీర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పలువురు కీలక అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేయడంతో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 19న శ్రీనగర్‌లోని బున్పోరా, నౌగామ్‌లో పోలీసులు, భద్రతా దళాలను హెచ్చరిస్తూ జైష్ ఏ మహ్మద్ పోస్టర్లు వెలిశాయి. ఆ తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెట్‌వర్క్‌లో పలువురు విద్యావంతులతో పాటు, ప్రొఫెనల్స్ ఉన్నారని.. విదేశీయ పరిచయాల ద్వారా పని చేస్తున్నట్లుగా తేలింది. సామాజిక, స్వచ్ఛంద సంస్థల ముసుగులో నిధులను సేకరించారు.
నిందితులు ఉగ్రవాదుల కోసం వ్యక్తులను గుర్తించడం, వారిని సమూలంగా మార్చడం, ఆయుధాలు, ఐఈడీ తయారీకి అవసరమైన పదార్థాలను సేకరించేందుకు పని చేశారు. ఇందులో
ఆరిఫ్ నిసార్ దార్ సాహిల్, (నౌగామ్), యాసిర్ ఉల్ అష్రఫ్ (నౌగామ్), మక్సూద్ అహ్మద్ దార్ షాహిద్ (నౌగామ్), మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ (షోపియాన్), జమీర్ అహ్మద్ అహంగర్ ముత్లాషా (గందర్బాల్)
డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై ముసైబ్ (పాంపోర్), డాక్టర్ ఆదిల్ (కుల్గామ్) అరెస్టు చేశారు. దర్యాప్తు సందర్భంగా పోలీసులు శ్రీనగర్, అనంత్‌నాగ్, గందర్బాల్, షోపియాన్, ఫరీదాబాద్, సహరాన్‌పూర్‌లో సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో అల్ ఫలాహ్ వర్సిటీ వద్ద డాక్టర్ ముజమ్మిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నివాసంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఫరీదాబాద్‌లో దాదాపుగా 360 కిలోల అమ్మోనియం నైట్రేట్, రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండో డాక్టర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఫరీదాబాద్‌లో ఆయుధాలను గుర్తించారు.