Adani | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఆప్త మిత్రుడు అదానీ కంపెనీలకు ఆర్థికంగా మేలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు మాత్రమే కాదు.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలు కూడా ఉవ్విళ్లూరుతున్నాయి. బీజేపీ పాలిత రాజస్థాన్, మహారాష్ట్ర తాజా విద్యుత్తు టెండర్లకు సంబంధించి ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. అదానీ పవర్ కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం ఏ మేరకు ఉన్నదో తెలుసుకొని మరీ టెండర్ నియమాలను ఆ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేశాయని నివేదిక మండిపడింది.
రానున్న 25 ఏండ్ల విద్యుత్తు అవసరాలకు గాను మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల టెండర్లకు ప్రకటనలు ఇచ్చాయి. సోలార్, థర్మల్ ఇలా రెండు పవర్ ప్లాంట్లను నిర్వహించే కంపెనీలే బిడ్‌లో పాల్గొనాలని మెలిక పెట్టాయి. 6,600 మెగావాట్ల విద్యుత్తులో 5 వేల మెగావాట్లు సోలార్ ప్లాంట్ల నుంచి మిగతాది థర్మల్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేయాలని మహా ప్రభుత్వం పేర్కొనగా.. 11,200 మెగావాట్ల విద్యుత్తులో 8 వేల మెగావాట్ల విద్యుత్తు సోలార్ ప్లాంట్ల నుంచి మిగతాది థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి జరిగేలా రాజస్థాన్ నిబంధనలు విధించింది. అయితే, దేశంలో చాలా తక్కువ కంపెనీలు మాత్రమే సోలార్, థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నాయని, అందులోనూ ఇంత సామర్థ్యంతో అదానీ మినహా మరే ఇతర కంపెనీలు విద్యుదుత్పత్తి చేయడం లేదని పారిశ్రామిక నిపుణులు చెప్తున్నారు. అదానీ గ్రూప్ కంపెనీలకు మేలు చేయడానికే ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చినట్టు ఆరోపిస్తున్నారు.
నిపుణులు అనుమానాలు వ్యక్తం చేసినట్టే మహారాష్ట్రకు చెందిన 6,600 మెగావాట్ల పవర్ కాంట్రాక్ట్‌ను అదానీ పవర్ దక్కించుకొన్నది. ఇక, రాజస్థాన్ బిడ్డింగ్‌లో అదానీ కంపెనీ ముందంజలో ఉన్నది. కాగా, మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రభుత్వాలు రూపొందించిన టెండర్లలో అన్ని నిబంధనలు, విషయాలు ఒకేలా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అదానీ కంపెనీలకు ఆర్థిక లబ్ధి చేయడానికే ఇలా టెండర్లను ఆయా ప్రభుత్వాలు రూపొందించాయని ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ మండిపడింది.