Telangana Bhavan | న్యూఢిల్లీ, మే 11 (నమస్తే తెలంగాణ): భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సరిహద్దు రాష్ర్టాల్లో నివసిస్తున్న తెలంగాణకు చెందిన విద్యార్థులు, పౌరులు పెద్దసంఖ్యలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటివరకు 180 మంది తెలంగాణవాసులు భవన్‌కు చేరుకున్నారు. వీరికి భోజన, వసతి, రవాణా ఏర్పాట్లు చేస్తున్నట్టు భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఇప్పటికే 26 మందిని రవాణా సౌకర్యాలు కల్పించి, స్వగ్రామాలకు పంపించినట్టు గౌరవ్ ఉప్పల్ చెప్పారు. తెలంగాణ భవన్‌కు చేరుకున్న ప్రతి ఒకరికీ సాయం అందిస్తామని స్పష్టంచేశారు.
హైదరాబాద్, మే 11 (నమస్తేతెలంగాణ) : పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) ఆక్రమించకుండా శాంతిచర్చలకు ఎందుకు వెళ్లారు? అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో యుద్ధం విరమించాలని తాను సూచిస్తే నారాయణను పాకిస్థాన్‌కు పంపాలని బీజేపీ నాయకులు అవాకులు, చెవాకులు మాట్లాడారని, ఇప్పుడు ప్రధాని మోదీని పాకిస్థాన్‌కు పంపాలా? అని నిలదీశారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ఉగ్రవాదులు ఎప్పటికైనా ప్రమాదకరమేనని, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందేనని స్పష్టంచేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ విరమణ, శాంతి చర్చలను సీపీఐ స్వాగతిస్తున్నట్టు తెలిపారు. పాక్‌పై యుద్ధానికి సీపీఐ వ్యతిరేకమని తేల్చి చెప్పారు. ఉగ్రవాదులపై దాడి చేయమని చెప్పినదానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.